బీఆర్‌ఎస్ ప్రాదేశిక ఎన్నికల వ్యూహం… దసరా తర్వాత రంగంలోకి అధినేత కేసీఆర్
- పరిషత్ ఎన్నికల్లో పైచేయి సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ
- సీఎం సహా మంత్రుల నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, బస్సు యాత్రలు
- ప్రజా క్షేత్రంలో పట్టు-కోసం ప్రతిపక్షంగా గట్టి పోరాటం
- నియోజకవర్గాల వారీగా పార్టీ పట్ల ప్రజాభిప్రాయ సేకరణ
- కొనసాగుతున్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, ఎంపీటీసీ, జడ్పీసీటీ ఎన్నికల ‘రేస్’కు కారు రె’ఢీ’
- అధినేత ఆదేశంతో రంగంలోకి నియోజకవర్గ ఇంఛార్జీలు, మూడ్‌లోకి గులాబీ శ్రేణులు
- వాస్తవ పరిస్థితులపై ఆరా, నియోజకవర్గాల్లో నేతల తిష్ట.. ప్రత్యర్థులకు ధీటుగా వ్యూహాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో : రాష్ట్రంలో ప్రాదేశిక ఎన్నికల వ్యూహంలో ప్రధాన ప్రతిపక్షంగా పైచేయి సాధించాలన్న గట్టి పట్టుదల బీఆర్‌ఎస్‌లో కనిపిస్తోంది. అందుకోసం అగ్రనేతలు మధ్య భారీ కసరత్తు జరుగుతోంది. దసరా తర్వాత అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగుతారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. తెలంగాణ భవన్‌లో కనిపించే నేతల నుంచి ధీమా వ్యక్తమవుతోంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో పైచేయి సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధమవుతోంది. సీఎం సహా మంత్రుల నియోజకవర్గాలే టార్గెట్‌గా బహిరంగ సభలు, బస్సు యాత్రలు నిర్వహింయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఆ దిశగా రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా, నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిల్లో కేడర్‌ను సంసిద్ధం చేస్తున్నారు. రాజకీయ భీష్ముడిగా పేరున్న కేసీఆర్ ప్రణాళికలు అనూహ్యంగా ఉంటాయన్నది అందరికీ తెలిసిందే.. కానీ త్వరలోనే జరగనున్న ప్రాదేశిక ఎన్నికలు 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు రెఫరెండమేనని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకటి, రెండు కాదు.. అనేక అంశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న క్రమంలో సాధారణ ఎన్నికలు గతానికి పూర్తి భిన్నంగా ఉంటాయని జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నా.. వాటిని అనుకూలంగా మలుచుకోవడంలో కేసీఆర్‌ది అందెవేసిన చెయ్యి అనేది గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.
గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తరహాలోనే 90శాతానికి పైగా జిల్లా పరిషత్, మండల పరిషత్‌లలో పాగా వేస్తామన్న అధికార కాంగ్రెస్ రాజకీయ ఎత్తుడగలకు భిన్నంగా బీఆర్‌ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కత్తులు నూరుతున్న కాంగ్రెస్, బీజేపీలకు అందనంత ఎత్తులో కేసీఆర్ పొలిటికల్ మాస్టర్ ప్లాన్‌తో సంసిద్ధమై ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాలను గుణపాఠంగా విజయమే లక్ష్యంగా దూసుకుపోవాలని అధినేత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలకు స్పష్టమైన సంకేతాలు పంపించినట్లు తెలుస్తోంది.
గత కొంత కాలంగా జిల్లా కమిటీలతో ఆయన నిరంతరం మాట్లాడుతూ క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో పార్టీలుగా బలబలాలు, గెలుపోటములను భేరీజు వేస్తున్నారు. త్వరలోనే వారందరితో మీటింగ్ పెట్టి ధైర్యాన్ని నూరియనున్నారు. దీంతో ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు నియోజకవర్గస్థాయి కమిటీలు అన్ని కోణాల్లో సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా లోకల్ ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్ళిపోయారు. కేసీఆర్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించినా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలు అభ్యర్థులను బరిలోకి దింపే విషయంలో అంతర్గత కసరత్తు ముమ్మరం చేశారు. మరోవైపు పోటీ చేసేందుకు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు జోరుగా సాగుతోంది.
పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న స్థానిక నేతలకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ ప్రాదేశిక ఎన్నికల్లో గెలిచే పరిస్థితి ఉందా? లేదా? తమపై నియోజకవర్గ ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది.? అనే విషయాలపై బాద్యుల ద్వారా సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. తమతమ నియోజకవర్గాల్లో మెజారిటీ సంఖ్యలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలను గెలిపించుకుంటేనే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఖాయమన్న కోణంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు బలాన్ని నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? జనాల్లో తమపై ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి? ఏఏ విషయాల్లో వ్యతిరేకత ఉంది? అనే విషయాలపై సర్వేల ద్వారా ఆరా తీస్తూ జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలకు చెందిన వ్యక్తులు ప్రజలకు నేరుగా ఫోన్ చేసి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వం పట్ల మీ అభిప్రాయం ఏమిటి? సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? లేదా? ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలపై మీకున్న అభిప్రాయం ఏమిటి? అన్న కోణంలో సమాచారం సేకరిస్తున్నారు. ధర్డ్ పార్టీ సమాచారం పక్కాగా ఉంటుందన్న కోణంలో ఈ తరహా అనేక విషయాలపై ఆరా తీస్తున్నారు.
