14న బీఆర్‌ఎస్‌ సింగరేణి కార్మిక గర్జన

ముఖ్య అతిథిగా కేటీఆర్‌..
ఏర్పాట్లపై హరీశ్‌రావు సన్నాహక సమావేశం

గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భారత రాష్ట్ర సమితి నడుం బిగించింది. కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ నెల 14న పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ‘సింగరేణి కార్మిక గర్జన’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. సభకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సింగరేణి పరివాహక నియోజకవర్గాలకు చెందిన భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకులు, టీబీజీకేఎస్‌ నాయకులతో మాజీ మంత్రి హరీశ్‌రావు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 14న సాయంత్రం 5 గంటలకు గోదావరిఖని జీఎం కార్యాలయ మైదానంలో కార్మిక గర్జన బహిరంగ సభను పెద్ద ఎత్తున నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులకు సభ ఏర్పాట్ల బాధ్యతలను అప్పగించారు.

సన్నాహక సమావేశంలో సింగరేణి ప్రాంత నాయకులు బాల్క సుమన్‌, కొప్పుల ఈశ్వర్‌, కోవా లక్ష్మి, చిన్నయ్య, వృద్ధిరాజు రవిచంద్ర, విజిత్‌రావు, కోరుకంటి చందర్‌, పుట్ట మధు, కౌశిక్‌ హరి, హరీశ్‌రెడ్డి, రేగ కాంతారావు తదితరులు పాల్గొన్నారు.