హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ భారీ ర్యాలీ..
ఆరు గ్యారంటీలు, 420 హామీలపై నిలదీత
మునుగోడు, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం మునుగోడు మండల కేంద్రంలో భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల మీదుగా అంబేద్కర్ సెంటర్‌కు చేరుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు తీరును వివరిస్తూ ‘కాంగ్రెస్ మోసాల జాబితా’ పేరుతో ముద్రించిన భారీ బ్యానర్‌ను ప్రదర్శించారు. నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి తన పదవిని కాపాడుకోవడం కోసం తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. రాష్ట్ర, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పదవుల కోసం అధిష్ఠానం చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు.
మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులు, దివ్యాంగులకు రూ.4 వేల పింఛన్, రైతులకు ఏటా రూ.15 వేల పెట్టుబడి సాయం, రైతు కూలీలకు రూ.12 వేల సాయం వంటి హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు. వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ హయాంలో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలు సమర్థంగా అమలయ్యాయని ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యారని ఆరోపించారు. మునుగోడును మున్సిపాలిటీగా మార్చడం, చండూరులో వంద పడకల ఆసుపత్రి, నాంపల్లిలో బస్టాండ్, కళాశాలల ఏర్పాటు వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని ప్రభాకర్‌రెడ్డి అన్నారు. హామీలు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.
సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి
బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో ప్రస్తుతం మండలానికో ఎమ్మెల్యే అన్నట్లుగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాత్రమే ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేవారని అన్నారు.
ప్రస్తుతం ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యత ఎవరిదో తెలియని పరిస్థితి నెలకొందని, ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారని స్రవంతి పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకులు స్పష్టమైన బాధ్యతతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మునగాల నారాయణరావు, చండూరు మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేష్, మాజీ ఎంపీపీలు తోకల వెంకన్న, పల్లె కళ్యాణి రవికుమార్, చౌటుప్పల్ మండల పార్టీ అధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్, నారాయణపురం మండల పార్టీ అధ్యక్షుడు నరసింహ, నాంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు నారాయణ, చండూరు మండల పార్టీ అధ్యక్షుడు సతీష్, మర్రిగూడ జగన్, చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్ దామోదర్‌రెడ్డి, పోలగోని సైదులు, మారగోని అంజయ్య, మేకల శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పగిల్ల సతీష్, సంయుక్త కార్యదర్శి మాదనబోయిన పరమేష్‌యాదవ్, జంగిలి సాంబయ్య, బేరి గురుపాదం, నల్గొండ అంజి, దోటి కరుణాకర్, బండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
