కాంగ్రెస్ హామీల ఫ్లకార్డులతో బీఆర్‌ఎస్ సమరభేరి
ఖానాపూర్‌లో భారీ ర్యాలీ.. పాల్గొన్న బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖానాపూర్ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.
భూక్యా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికే ఈ కార్యక్రమం నిర్వహించడం లేదని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నా వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చారని, 33 నెలలు గడిచినా ఆ హామీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వృద్ధులు, బీడీ కార్మికులకు నెలకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000 ఇస్తామని ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద తులం బంగారం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, తమ ఆడబిడ్డల వివాహాల కోసం పేద కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని పేర్కొన్నారు.
విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పడంతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జాన్సన్ నాయక్ ఆరోపించారు. చదువుకోవాల్సిన విద్యార్థులు ఫీజుల కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, వాటిని అమలు చేయకపోవడంతో ఖానాపూర్ నియోజకవర్గంలోని వేలాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.
రైతులకు రైతుభరోసా, రైతు రుణమాఫీ, పంటలకు బోనస్ వంటి హామీలు ఇచ్చారని, అయితే రైతులు ఇప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. రైతు కూలీలు, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను కూడా వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని జాన్సన్ నాయక్ కోరారు. బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచి పోరాడుతుందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నాయకత్వంలో ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్, కడెం, పెంబి, దస్తూరాబాద్ మండలాల బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
