వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ నిరసన
నాగర్‌కర్నూల్‌లో భారీ ర్యాలీ.. అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ పార్కు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ అసమర్థ కాంగ్రెస్‌కు ఓటు వేయడం వల్లే రాష్ట్రం అధోగతి పాలైందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు దగా పడ్డారని, కాంగ్రెస్ నేతలు మాత్రం బాగుపడ్డారని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
రైతు భరోసా కింద రూ.15 వేలు, మహిళలకు రూ.2,500, వికలాంగులకు రూ.6 వేల పింఛన్ ఇస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలనే కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేస్తోందని ఆరోపించారు.
నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయకుండా యువత, విద్యార్థులను మోసం చేశారని మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి ఎమ్మెల్యేలు, మంత్రులు డబ్బు సంపాదనపైనే దృష్టి పెట్టారని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో సాగునీరు, విద్యుత్, రైతుబంధు, ఎరువుల విషయంలో రైతులకు అండగా నిలిచారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి ఆధారాలు ఉంటే నిరూపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వికలాంగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.
రైతు భరోసాను ఆరు పర్యాయాలు ఇవ్వాల్సి ఉండగా మూడు పర్యాయాలు మాత్రమే ఇచ్చారని అన్నారు. వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ప్రచార ఆర్భాటమే మిగిలిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏడు రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని మర్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
