కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై మునుగోడులో బీఆర్‌ఎస్‌ ధర్నా

కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన..
420 హామీలు నెరవేర్చే వరకు పోరాటం: మాజీ ఎమ్మెల్యే

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా తీవ్ర నయవంచనకు పాల్పడుతోందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో భారీ ధర్నా నిర్వహించారు.

ధర్నాకు బయలుదేరే ముందు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వందలాది కార్లు, ద్విచక్రవాహనాలు, వేలాది మంది బీఆర్‌ఎస్‌ శ్రేణులతో భారీ కాన్వాయ్‌గా మునుగోడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మునుగోడులో బీఆర్‌ఎస్‌ జెండాలు, కార్యకర్తల నినాదాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

రైతులు, మహిళలు, యువతను కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన బీఆర్‌ఎస్‌ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. 420 హామీలు నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతిరెడ్డి, చౌటుప్పల్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి, సర్పంచుల సంఘం యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి గిర్కటి నిరంజన్‌గౌడ్‌, ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు సుర్కంటి శ్రీధర్‌రెడ్డి, సంఘం చౌటుప్పల్‌ మండల అధ్యక్షుడు సుర్వి మల్లేష్‌గౌడ్‌, నాయకులు పెద్దిటి బుచ్చిరెడ్డి, కళ్లెం శ్రీనివాస్‌రెడ్డి, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.