పరిహారం చెల్లించాకే కెనాల్ పనులు చేపట్టాలి!
- ఓపెన్ కెనాల్ పనులను అడ్డుకున్న బీఆర్‌ఎస్ నాయకులు
- భూనిర్వాసిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్
- పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ
ఊట్కూర్, నవంబర్ 3 (ఆంధ్రప్రభ): నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం దంతాన్‌పల్లి శివారులో మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం ఓపెన్ కెనాల్ పనులను బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం అడ్డుకున్నారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించిన కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న నాయకులు వాటిని నిలిపివేశారు.

ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌వీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు కోరం శివరాజు రెడ్డి, నాయకులు వడ్ల మోనప్ప, ఇబాదూర్ రెహమాన్, తరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎత్తిపోతల పథకం పనుల్లో భూములు కోల్పోయిన పలువురు రైతులకు ఇంకా పూర్తి పరిహారం అందలేదని తెలిపారు. భూములకు పరిహారంతో పాటు పొలాల్లోని బోరుబావులు, చెట్లు, గుడిసెలు తదితర వాటికి కూడా పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. వీటన్నింటికీ పూర్తిస్థాయిలో పరిహారం అందించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
పనులు పూర్తయిన తర్వాత భూనిర్వాసిత రైతులను పట్టించుకునే వారు ఉండరని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పనులు కొనసాగనివ్వబోమని స్పష్టం చేశారు.
విషయం తెలుసుకున్న తహసీల్దార్ అశోక్‌కుమార్ అక్కడికి చేరుకుని నాయకులు, రైతులతో మాట్లాడారు. భూనిర్వాసిత రైతులకు చెట్లు, బోరుబావులు, కంచెలు తదితర వాటికి సంబంధించిన పరిహారం అందేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు అభిలాష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
