చైర్మన్,కమిషనర్ ఒంటెద్దు పోకడలు మానుకోవాలి

  • సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు

తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రూరు మున్సిపల్ చైర్మన్,కమిషనర్ ఒంటెద్దు పోకడలు మానుకోవాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.తమకు సంబంధం లేకుండా తీర్మానాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తూ మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం బీఆర్ఎస్ కౌన్సిలర్లు బహిష్కరించారు.అనంతరం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు మాట్లాడుతూ… మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి ముందు కౌన్సిలర్లతో తీర్మానాలపై చర్చించాల్సి ఉంటుందని, వాటినే సమావేశంలో ఎజెండాగా పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. దానికి విరుద్ధంగా మున్సిపల్ చైర్మన్,కమిషనర్ సభ్యులకు తెలియకుండా వారికి వారే అంశాలు నిర్ణయించుకుని ఎలాంటి చర్చ లేకుండా సమావేశంలో ఏకపక్షంగా పెట్టాలని చూడటం దారుణమన్నారు.

తెలంగాణ మున్సిపల్ చట్టంను అనుసరించి చైర్మన్,కమిషనర్ వ్యవహరించాల్సి ఉంటుందని, దానికి విరుద్ధంగా పాలకుడు, అధికారి వ్యవహరిస్తున్నారన్నారు. ఎజెండా కాపీలు సభ్యులకు అందజేయకుండా జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు.తొర్రూరు పట్టణ అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు సహకరిస్తామని తెలిపినప్పటికీ…అధికార పార్టీ చైర్మన్,కమిషనర్ ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కుతున్నారన్నారు.కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి సైతం కమిషనర్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని అన్నారు.

పట్టణ అభివృద్ధికి కాకుండా సొంత అభివృద్ధి కోసం పాకులాడుతున్నారని, ఈ విషయంలో పాలకవర్గం తీరు మారకపోతే ఉన్నతాధికారులను కలిసి నివేదిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కౌన్సిలర్లు కర్నే నాగరాజు, భూసాని జయమ్మ ఉప్పలయ్య, తూర్పాటి రవి, పేర్ల జంపన్న, చకిలేల అలివేలు, మాడుగుల భవానీ లత, అల్లం శ్యామల శ్యామ్, కిన్నెర కవిత సతీష్, ధరావత్ పద్మ కిషన్ నాయక్, మాజీ కౌన్సిలర్లు ధరావత్ జైసింగ్ నాయక్, గుగులోత్ శంకర్,నాయకులు రాయిశెట్టి వెంకన్న, భూసాని ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.