కేటీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి

  • తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పోరాటం ఉధృతం చేస్తాం..
  • కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, బీఆర్‌ఎస్‌ కార్యాచరణపై చర్చ..
  • ఆస్ట్రేలియాలో పార్టీ విస్తరణపైనా సమాలోచన
  • సోషల్‌ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ను బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన పాలన, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, రానున్న రెండేళ్లలో బీఆర్‌ఎస్‌ చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీల అమలులో విఫలమవుతున్న తీరును ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడంతో పాటు.. ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌ పోరాటాన్ని మరింత క్రియాశీలం చేసి ప్రజల గొంతుకగా నిలిపే అంశాలపై కేటీఆర్‌తో నాగేందర్‌రెడ్డి చర్చించారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లడం, బీఆర్‌ఎస్‌ విధానాలను విస్తృతంగా ప్రచారం చేయడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు.

అదేవిధంగా ఆస్ట్రేలియాలో బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలను మరింత విస్తరించడం, పార్టీ కార్యక్రమాలకు అక్కడి ఎన్నారైల మద్దతును సమీకరించడం, తెలంగాణ ప్రయోజనాల కోసం చేపడుతున్న సామాజిక, రాజకీయ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడంపైనా సమాలోచనలు జరిగాయి.

కేటీఆర్‌ ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలపైనా ఇరువురు చర్చించారు. ఆస్ట్రేలియాలో బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేందుకు కాసర్ల నాగేందర్‌రెడ్డి నాయకత్వంలో చేపడుతున్న కార్యక్రమాలను కేటీఆర్‌ అభినందించారు. పార్టీ బలోపేతం కోసం ఆస్ట్రేలియాలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు చేస్తున్న కృషిని ప్రశంసించారు.

రానున్న రోజుల్లో తెలంగాణలో ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్‌ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడంతో పాటు.. ఆస్ట్రేలియాలోనూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి బీఆర్‌ఎస్‌ వాణిని బలంగా వినిపిస్తామని కాసర్ల నాగేందర్‌రెడ్డి తెలిపారు.