పురుగుల మందు తాగి అన్నదమ్ములు ఆత్మహత్య
క్రోసూరు, ఆంధ్రప్రభ: మద్యం తాగి ఇంటికి వచ్చినందుకు తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు అన్నదమ్ములు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన క్రోసూరు మండలం 88 తాళ్లూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే ఇంట్లో ఇద్దరు కుమారులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
క్రోసూరు పోలీసుల కథనం ప్రకారం.. 88 తాళ్లూరు గ్రామానికి చెందిన లంకోటి కోటేశ్వరరావు (29), లంకోటి సీతారామయ్య (27) అన్నదమ్ములు. మద్యం తాగి ఇంటికి వచ్చినందుకు తల్లి మందలించడంతో ఇద్దరూ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.
ఇద్దరూ పురుగుల మందు తాగిన విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే వారిని సత్తెనపల్లి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్న కుమారుడు లంకోటి సీతారామయ్య మృతి చెందాడు. పెద్ద కుమారుడు లంకోటి కోటేశ్వరరావును మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మృతుడు కోటేశ్వరరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో మృతుడు సీతారామయ్యకు భార్య ఉంది. ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై క్రోసూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
