Britain-Unity-Crisis-Scotland-Wales-Northern-Ireland-Independence-Demand | బ్రిటన్ భవిష్యత్తుకు కొత్త సవాల్.. మూడు దేశాల డిమాండ్ వెనుక అసలు కారణాలేంటి?
Britain-Unity-Crisis-Scotland-Wales-Northern-Ireland-Independence-Demand | బ్రిటన్ భవిష్యత్తుకు కొత్త సవాల్.. మూడు దేశాల డిమాండ్ వెనుక అసలు కారణాలేంటి?
- స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ స్వయం నిర్ణయ హక్కు డిమాండ్..
- విడిపోవాలన్న లక్ష్యంతో మూడు పార్టీల జట్టు
- నిజంగా బ్రిటన్ విభజన జరుగుతుందా? లేక యునైటెడ్ కింగ్‌డమ్ ఐక్యంగా కొనసాగుతుందా?
- స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ నేతల ఐక్యత.. యునైటెడ్ కింగ్‌డమ్ భవిష్యత్తుపై పెరుగుతున్న చర్చ
Britain-Unity-Crisis-Scotland-Wales-Northern-Ireland-Independence-Demand | ఆంధ్రప్రభ వెబ్, అంతర్జాతీయ ప్రతినిధి : బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి విడిపోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్న స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాల ప్రధాన జాతీయవాద పార్టీల నేతలు తొలిసారి ఒకే వేదికపైకి వచ్చారు. తమ ప్రాంతాల భవిష్యత్తును తామే నిర్ణయించుకునే హక్కు ఉందంటూ సంయుక్త ప్రకటన చేశారు. వేల్స్ రాజధాని కార్డిఫ్‌లో సోమవారం జరిగిన సమావేశంలో స్కాటిష్ నేషనల్ పార్టీ (SNP) నేత జాన్ స్విన్నీ, ప్లెయిడ్ సైమ్రూ నేత రున్ ఆప్ ఇయోర్త్, సిన్ ఫెయిన్ నేతలు మేరీ లూ మెక్‌డొనాల్డ్, మిచెల్ ఓ’నీల్ పాల్గొన్నారు. ఇది కేవలం రాజకీయ ప్రకటన మాత్రమే కాకుండా.. బ్రిటన్ రాజ్యాంగ భవిష్యత్తుపై కొత్త చర్చకు దారితీసే పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
“మా భవిష్యత్తును మేమే నిర్ణయించుకుంటాం”
వేల్స్ రాజధాని కార్డిఫ్‌లో జరిగిన సమావేశంలో స్కాటిష్ నేషనల్ పార్టీ (SNP) నేత జాన్ స్విన్నీ, ప్లెయిడ్ సైమ్రూ (Plaid Cymru) నేత రున్ ఆప్ ఇయోర్త్, సిన్ ఫెయిన్ (Sinn Fein) నేతలు మేరీ లూ మెక్‌డొనాల్డ్, మిచెల్ ఓ’నీల్.. సమావేశం అనంతరం విడుదల చేసిన ఓ సంయుక్త ప్రకటనలో మూడు పార్టీల నేతలు వెస్ట్‌మినిస్టర్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. “మా దేశాలకు స్వయం నిర్ణయ హక్కు ఉంది. ప్రజాస్వామ్యాన్ని అడ్డుకునే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదు. మా ప్రజల భవిష్యత్తును వారే నిర్ణయించుకుంటారు” అని స్పష్టం చేశారు. లండన్‌లోని బ్రిటన్ పార్లమెంట్ తమ ఆకాంక్షలను అడ్డుకోలేదని నేతలు పేర్కొన్నారు.
విడిపోవడమే ప్రధాన లక్ష్యం
బ్రిటన్‌లోని మూడు ప్రాంతాలకు చెందిన ఈ పార్టీలు చాలా కాలంగా ప్రత్యేక గుర్తింపు, స్వయం పాలన, చివరకు స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్నాయి.
స్కాటిష్ నేషనల్ పార్టీ (SNP):
స్కాట్లాండ్‌కు ప్రత్యేక దేశ హోదా కావాలని డిమాండ్ చేస్తోంది. 2014లో జరిగిన స్వాతంత్ర్య ప్రజాభిప్రాయ సేకరణలో బ్రిటన్‌లోనే కొనసాగాలని మెజారిటీ ప్రజలు నిర్ణయించారు. అయితే బ్రెగ్జిట్ తర్వాత పరిస్థితులు మారాయని SNP వాదిస్తోంది.
ప్లెయిడ్ సైమ్రూ (Plaid Cymru):
వేల్స్‌కు మరింత స్వయం ప్రతిపత్తి, దీర్ఘకాలంలో స్వాతంత్ర్యం లక్ష్యంగా పనిచేస్తోంది.
సిన్ ఫెయిన్ (Sinn Fein):
ఉత్తర ఐర్లాండ్‌ను ఐర్లాండ్ రిపబ్లిక్‌తో కలపాలని కోరుతోంది. దీనిపై భవిష్యత్తులో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని డిమాండ్ చేస్తోంది.
యూరోపియన్ యూనియన్ వైపు చూపు
మూడు పార్టీలు తమ భవిష్యత్తు యూరోపియన్ యూనియన్‌తో అనుసంధానమై ఉంటుందని పేర్కొన్నాయి. “ఈ ప్రాంతాల ప్రజల భవిష్యత్తు యూరోపియన్ యూనియన్‌లో ఉంది. రాజ్యాంగ మార్పులు తప్పవు. స్వాతంత్ర్య ఉద్యమాలకు ఊపు పెరుగుతోంది” అని సంయుక్త ఒప్పందంలో పేర్కొన్నారు. వెస్ట్‌మినిస్టర్ పాలన ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయని కూడా నేతలు వ్యాఖ్యానించారు.
బ్రిటన్‌కు కొత్త తలనొప్పి
ప్రస్తుతం బ్రిటన్ ప్రభుత్వం ఈ డిమాండ్లను అంత సులభంగా అంగీకరించే పరిస్థితిలో లేదు. ముఖ్యంగా స్కాట్లాండ్‌లో మరోసారి స్వాతంత్ర్య ఓటింగ్ నిర్వహించాలన్న డిమాండ్‌ను లండన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఒక వేళ విడిపోతే ఎదురయ్యే సమస్యలపై నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది? కరెన్సీ ఏది? రక్షణ బాధ్యతలు ఎవరివి? అంతర్జాతీయ గుర్తింపు ఎలా లభిస్తుంది? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంటుంది.
చరిత్రను మార్చే ప్రయత్నమా?
బ్రిటన్ ఒకప్పుడు ప్రపంచ శక్తిగా నిలిచినా.. ప్రస్తుతం అంతర్గత రాజకీయ విభేదాలను ఎదుర్కొంటోంది. స్కాట్లాండ్ స్వాతంత్ర్య డిమాండ్, ఉత్తర ఐర్లాండ్ ఐక్యత ఉద్యమం, వేల్స్‌లో పెరుగుతున్న స్వయం పాలన ఆకాంక్షలు కలిసి బ్రిటన్ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మూడు ప్రాంతాల నేతలు ఒకే వేదికపైకి రావడం వల్ల ఈ ఉద్యమాలకు కొత్త రాజకీయ బలం వచ్చినప్పటికీ.. నిజంగా బ్రిటన్ విభజన జరుగుతుందా? లేక యునైటెడ్ కింగ్‌డమ్ ఐక్యంగా కొనసాగుతుందా? అనేది ప్రజల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
