BRICS Summit 2026 | “భారత్” బహుముఖ వ్యూహానికి ఆయుధంగా ” బ్రిక్స్” శిఖరాగ్ర సదస్సు

  • ఢిల్లీలో మోదీ-పుతిన్ ద్వైపాక్షిక చర్చలు
  • చౌక చమురు, రక్షణ ఒప్పందాలే అజెండా
  • అంచనాలు అనేకం.. ఆశలు, ఆకాంక్షలు నెరవేరే సమయం
  • అంతర్జాతీయ క్షిపణిలో అద్భుతమైన ఘట్టం
  • యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత పర్యటన
  • తొమ్మిది నెలల వ్యవధిలోనే ఇది రెండోసారి
  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భారత్ మండపంలో ద్వైపాక్షిక చర్చలు
  • అమెరికా ఆంక్షల నేపథ్యంలో డాలర్ అవసరం లేకుండా ద్వైపాక్షిక వాణిజ్యం కోసం ప్రయత్నాలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో : దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా అంతర్జాతీయ దౌత్యం వేడెక్కింది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం భారత్‌కు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భారత్ మండపంలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత పర్యటనకు రావడం తొమ్మిది నెలల వ్యవధిలోనే ఇది రెండోసారి కావడం గమనార్హం. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్‌లతో కూడా ప్రధాని మోదీ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ మోదీ-పుతిన్ భేటీ సాధారణమైనది కాదని పారిశ్రామిక, వాణిజ్య రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మధ్యప్రాచ్యంలో ఘర్షణలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు దాదాపు 100 డాలర్ల మార్కుకు చేరింది. రూపాయి మారకం విలువపై ఒత్తిడి పెరుగుతున్న వేళ.. రష్యా నుంచి రాయితీపై నిరంతరాయంగా ముడి చమురు దిగుమతులు భారత్‌కు అత్యవసరం. సుఖోయ్ సు-57 అత్యాధునిక యుద్ధ విమానాల కొనుగోలు, బ్రహ్మోస్ అప్‌గ్రేడ్, ఎస్-400 డెలివరీలు, భారత్‌లోనే విమానాల తయారీపై చర్చలు జరగనున్నాయి. అమెరికా ఆంక్షల నేపథ్యంలో డాలర్ అవసరం లేకుండా ద్వైపాక్షిక వాణిజ్యం కోసం రూపాయి-రూబుల్ చెల్లింపులు, బ్యాంకింగ్ నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడంపై ఇరుదేశాలు దృష్టి సారించాయి. పశ్చిమ దేశాల ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా, వర్ధమాన ఆర్థిక వ్యవస్థల భాగస్వామ్యం కోసం 2009లో బ్రిక్స్ కూటమి ఏర్పడింది.

పాఠశాలలు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవు..

భద్రతా కారణాల దృష్ట్యా సెప్టెంబర్ 9 శుక్రవారం దిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా సెప్టెంబర్ 11ను స్థానిక సెలవు దినంగా ప్రకటించారు. దీనితో పాటు దిల్లీ ప్రభుత్వ పరిధిలోని కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు శుక్రవారం మూతపడనున్నాయి. శని, ఆదివారాల సెలవుల అనంతరం సోమవారం నుంచి బడులు, ఆఫీసులు తిరిగి ప్రారంభమవుతాయి.

బ్యాంకులు, ప్రైవేటు కార్యాలయాల పరిస్థితి?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 11న బ్యాంకింగ్ సెలవు లేదు. అయితే నేడు దేశవ్యాప్తంగా బ్యాంకు సమ్మె ఉంది. ఫలితంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇక ప్రైవేటు కంపెనీల కార్యాలయాలు కూడా తెరిచే ఉంటాయి. అయితే, సెంట్రల్ దిల్లీ, ల్యూటియెన్స్ జోన్ పరిధిలోని రోడ్లపై వీవీఐపీ కాన్వాయ్ కదలికలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల తీవ్ర ట్రాఫిక్ మళ్లింపులు ఎదురయ్యే అవకాశముండటంతో, సాధ్యమైనంత వరకు ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఇవ్వాలని కంపెనీలకు పోలీసులు సూచించారు.

4,800 మంది పోలీసులతో భద్రత, రోడ్లపై ఆంక్షలు

బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు దిల్లీ ట్రాఫిక్ పోలీస్ శాఖ ప్రత్యేక ప్లాన్ రూపొందించింది. దాదాపు 4,800 మంది ట్రాఫిక్ సిబ్బందిని విధుల్లోకి దించారు. వీవీఐపీ వాహనాల రిహార్సల్స్, ప్రతినిధుల ప్రయాణాల సమయంలో 22 ప్రధాన జంక్షన్ల వద్ద వాహనాలను మళ్లిస్తారు. మధురా రోడ్, సర్దార్ పటేల్ మార్గ్, శాంతి పథ్, జనపథ్, అశోకా రోడ్, బారాఖంబా రోడ్, టాల్‌స్టాయ్ మార్గ్, ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించడం జరుగుతుంది. యాప్ ఆధారిత క్యాబ్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రయాణానికి ముందే ట్రాఫిక్ హెచ్చరికలను గమనించడం శ్రేయస్కరంగా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తమై పనిచేస్తోంది.

ఆరేళ్ల తర్వాత భారత్‌లో షీ జిన్‌పింగ్!

ఈ బ్రిక్స్ సదస్సులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో కీలక అంశం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రాక! 2020లో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత దాదాపు ఆరేళ్ల విరామం అనంతరం ఆయన భారత గడ్డపై అడుగుపెడుతున్నారు. గాల్వాన్ ఘటనలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య బంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల కాలంలో ప్రత్యక్ష విమాన సర్వీసులు, వీసాల జారీ, ఉన్నత స్థాయి దౌత్య చర్చలు పునఃప్రారంభమవడంతో ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో మోదీ, జిన్‌పింగ్‌ల భేటీ ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలకు కొత్త ఊపిరి పోస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

విస్తరించిన 11 సభ్యదేశాల కూటమి

బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా వ్యవస్థాపక దేశాలుగా ఉన్న ఈ కూటమి ఇటీవల మరింత విస్తరించింది. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా దేశాలు కొత్తగా చేరడంతో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య 11కు చేరింది. గ్లోబల్ సౌత్ దేశాల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడంలో ఈ విస్తరిస్తున్న కూటమి కీలకంగా మారింది.

గ్లోబల్ సౌత్ వేదికగా భారత్ అజెండా..

“ఉమ్మడి ప్రాధాన్యతలపై అంతర్గత సహకారాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఆలోచనలను పంచుకోవడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం,” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న ఈ వేదికపై భారత్ తన దౌత్య చతురతను చాటుకుంటూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా చర్చలు నడిపే అవకాశం ఉంది.

అంతర్జాతీయ ప్రముఖలకు లగ్జరీ హోటళ్లు, భారీగా భద్రత

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల అధినేతలు, ప్రతినిధులు ఢిల్లీకి చేరుకుంటుండటంతో నగరంలోని ప్రముఖ లగ్జరీ హోటళ్ల వద్ద భద్రతను భారీగా పెంచారు. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారుల కోసం ఢిల్లీ వ్యాప్తంగా 3,000కు పైగా హోటల్ గదులను బుక్ చేసినట్లు సమాచారం. కొన్ని లగ్జరీ హోటళ్లలో ఒక్క రాత్రి గది అద్దె రూ.2 లక్షలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.

లే మెరిడియన్

లే మెరిడియన్ న్యూ ఢిల్లీలో బ్రిక్స్ దేశాల ప్రతినిధులతో పాటు ఇతర ప్రముఖ అంతర్జాతీయ సంస్థల అధికారులు కూడా బస చేయనున్నారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు అధ్యక్షుడు, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు అధ్యక్షుడు ఈ హోటల్‌లో బస చేయనున్నట్లు సమాచారం. ఉగాండా, నైజీరియా, మలేషియా దేశాల ప్రతినిధి బృందాలు కూడా లే మెరిడియన్‌లో బస చేయనున్నాయి.

షాంగ్రి-లా ఎరోస్

అశోకా రోడ్‌లో ఉన్న షాంగ్రి-లా ఎరోస్ హోటల్‌లో పశ్చిమ ఆసియాకు చెందిన ఓ బ్రిక్స్ సభ్య దేశం ప్రతినిధి బృందం బస చేయనుంది. హోటల్‌లోని సూట్‌లన్నీ ఇప్పటికే బుక్ అయినట్లు సమాచారం. ఇక్కడ గది అద్దెలు ఒక్క రాత్రికి రూ.60,000 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. హోటల్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పలుదశల్లో భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతినిధుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని హోటల్ వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.

తాజ్ ప్యాలెస్‌లో షీ జిన్‌పింగ్

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సెప్టెంబర్ 11న ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆయన న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో బస చేయనున్నట్లు సమాచారం. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఈ హోటల్‌లోని గదులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం గదులన్నీ బుక్ అయినట్లు తెలుస్తోంది.

ఒబెరాయ్

డాక్టర్ జాకిర్ హుస్సేన్ మార్గ్‌లో ఉన్న ఒబెరాయ్ న్యూ ఢిల్లీ హోటల్‌లో బ్రెజిల్, కజకిస్తాన్, ఇథియోపియా, ఇండోనేషియా దేశాల ప్రతినిధి బృందాలు బస చేయనున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా ఈ హోటల్‌కు రానున్నట్లు సమాచారం. ఆయన రాక నేపథ్యంలో హోటల్ వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఐటీసీ మౌర్యలో వ్లాదిమిర్ పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేయనున్నట్లు సమాచారం. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఈ హోటల్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఒక్క రాత్రికి గది అద్దె రూ.2 లక్షలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.