BRICS Summit 2026 | బ్రిక్స్‌ వేదికగా భారత్‌–చైనా కొత్త అధ్యాయం

  • సంబంధాల పునరుద్ధరణపై కీలక చర్చలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారత్‌, చైనా సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2020లో జరిగిన గాల్వాన్‌ లోయ ఘర్షణ తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భారత గడ్డపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా జరిగిన ఈ భేటీలో ఇరు దేశాల మధ్య సంబంధాలను తిరిగి గాడిలో పెట్టడంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని, బ్రిక్స్‌ వంటి అంతర్జాతీయ వేదికల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని షీ జిన్‌పింగ్‌ ఆకాంక్షించారు. భారత్‌, చైనాలు ఒకరి అభివృద్ధి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకుంటూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

గాల్వాన్‌ తర్వాత తొలిసారి భారత్‌లో షీ

తూర్పు లడఖ్‌లోని గాల్వాన్‌ లోయలో 2020 జూన్‌లో జరిగిన ఘర్షణ తర్వాత భారత్‌–చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాదాపు ఏడేళ్ల తర్వాత షీ జిన్‌పింగ్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. చివరిసారిగా 2019 అక్టోబర్‌లో చెన్నై సమీపంలోని మామల్లాపురంలో ప్రధాని మోదీతో జరిగిన అనధికారిక శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే ఇరు దేశాల సైన్యాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది.

సరిహద్దు సమస్యపై కీలక చర్చలు

మోదీ–షీ భేటీలో సరిహద్దు వివాదం ప్రధాన అంశంగా మారింది. తూర్పు లడఖ్‌లో గాల్వాన్‌ ఘటన తర్వాత ఏర్పడిన పరిస్థితులు, వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వద్ద శాంతి, భద్రత అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించినట్లు సమాచారం. సరిహద్దు వద్ద శాంతి నెలకొనడం ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు కీలకమని భారత్‌ మొదటి నుంచి స్పష్టం చేస్తోంది. సరిహద్దు సమస్య పరిష్కారం కాకపోయినా.. ఇతర రంగాల్లో సహకారాన్ని కొనసాగించే దిశగా ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

విమాన సర్వీసులు, వీసాలపై ముందడుగు

ఇరు దేశాలు సంబంధాల మెరుగుదలకు కొన్ని చర్యలు చేపట్టాయి. ఐదేళ్లకు పైగా నిలిచిపోయిన ప్రత్యక్ష విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని వీసా విధానాలను సులభతరం చేయడంతో పాటు కైలాష్‌ మానసరోవర్‌ యాత్ర, సరిహద్దు వాణిజ్యం, ప్రజల మధ్య సంబంధాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాయి.జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ ఇటీవల బీజింగ్‌లో 25వ విడత ప్రత్యేక ప్రతినిధుల చర్చలు జరిపారు. సరిహద్దు వద్ద శాంతి, దీర్ఘకాలిక వివాద పరిష్కారంపై వీరి చర్చలు సాగాయి.

రూ.151 బిలియన్‌ డాలర్లకు భారత్‌–చైనా వాణిజ్యం..

ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా చర్చల్లో కీలక అంశంగా మారనున్నాయి. 2025–26లో భారత్‌–చైనా ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 151 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇందులో భారత్‌ చైనా నుంచి దాదాపు 131 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకోగా.. 19 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. దీంతో భారత్‌కు సుమారు 112 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడింది. చైనా యంత్రాలు, ఎలక్ట్రానిక్స్‌, పారిశ్రామిక విడిభాగాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు భారత్‌ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో మరింత మార్కెట్‌ ప్రాప్యత, సమతుల్య ఆర్థిక సంబంధాలను కోరుకుంటోంది.

బ్రిక్స్‌, షాంఘై సహకార సంస్థ వంటి వేదికల్లో భారత్‌, చైనాలు కలిసి పనిచేస్తున్నప్పటికీ.. సరిహద్దు వివాదం, ప్రాంతీయ వ్యూహాత్మక అంశాలపై విభేదాలు కొనసాగుతున్నాయి.ప్రస్తుతం జరుగుతున్న ఈ చర్చలు ఇరు దేశాల మధ్య ఇటీవల మెరుగుపడుతున్న సంబంధాలను మరింత స్థిరత్వం వైపు తీసుకెళ్తాయా అన్నదానిపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

తాజా మోదీ–షీ భేటీతో సంబంధాల్లో వచ్చిన మార్పులు ఎంతవరకు ముందుకు వెళ్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సరిహద్దు వద్ద దీర్ఘకాలిక శాంతి, పరస్పర విశ్వాసం పెంపొందితేనే భారత్‌–చైనా సంబంధాలు పూర్తిస్థాయిలో మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.