BRICS Summit 2026 | ముగ్గురు ఉద్దండుల ఒక్క ఫొటో.. ఎన్నో సంకేతాలు!

  • మోడీ, పుతిన్‌, జిన్‌పింగ్‌ కలిసిన వేళ..
  • ఇరాన్‌-సౌదీ-యూఏఈ మధ్య ఏకాభిప్రాయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ పొలిటికల్‌ బ్యూరో : బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశం వేదికగా భారత దౌత్యం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో కలిసి ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మోడీ, పుతిన్‌, జిన్‌పింగ్‌ ముగ్గురూ కలిసి కనిపించిన దృశ్యం.. బ్రిక్స్‌లో మారుతున్న సమీకరణాలకు సంకేతంగా రాజకీయ, దౌత్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మోదీ-పుతిన్‌-జిన్‌పింగ్‌ మధ్య జరిగిన తాజా భేటీ-.. గత మూడేళ్లలో ఈ ముగ్గురు నేతలు కలిసి కనిపించిన మూడో సందర్భంగా నిలిచింది. మరో ఫొటోలో మోడీ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో మాట్లాడుతుండగా, పుతిన్‌ ఆయన పక్కనే కనిపించారు. మరో చిత్రంలో మోదీ, పుతిన్‌ కలిసి నడుస్తూ నవ్వుతున్న దృశ్యం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

BRICS Summit 2026

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలను ఒకే వేదికపై ఏకాభిప్రాయానికి తీసుకురావడం భారత్‌కు పెద్ద దౌత్య సవాలుగా మారింది. ముఖ్యంగా ప్రాంతీయ విభేదాలు, భద్రతా సమస్యలు, ఇంధన సరఫరా, వాణిజ్య మార్గాలకు సంబంధించిన అంశాలపై సభ్య దేశాల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయినప్పటికీ, విస్తృత చర్చల అనంతరం బ్రిక్స్‌ దేశాలు ఉమ్మడి అవగాహనకు రావడం భారత్‌ అధ్యక్షతకు కీలక విజయంగా భావిస్తున్నారు. సభ్య దేశాల మధ్య విభేదాలను తగ్గించేందుకు భారత ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు- విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

ప్రపంచ సంక్షోభాల మధ్య కీలక శిఖరాగ్ర సమావేశం

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియా సంక్షౌభం, హోర్ముజ్‌ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు, అమెరికా వాణిజ్య-సుంకాల విధానాల ప్రభావం వంటి పరిణామాల మధ్య ఈ బ్రిక్స్‌ సమావేశం జరిగింది. అందుకే ఈ సదస్సు కేవలం సభ్య దేశాల సమావేశంగానే కాకుండా.. మారుతున్న ప్రపంచ రాజకీయ, ఆర్థిక సమీకరణాలకు కీలక వేదికగా మారింది. భారత్‌ అధ్యక్షతన ”స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం” అనే థీమ్‌తో జరుగుతున్న ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితి, డబ్ల్యూటీఓ, డబ్ల్యూహెచ్‌ఓ తదితర అంతర్జాతీయ సంస్థల అధిపతులు కూడా పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే.. బ్రిక్స్‌ విస్తరణ తర్వాత ఏర్పడిన కొత్త సమీకరణాల మధ్య భారత్‌ తన దౌత్య సామర్థ్యాన్ని మరోసారి చాటుకుంది. విభిన్న ప్రయోజనాలు, ప్రాంతీయ విభేదాలు ఉన్న దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా న్యూఢిల్లీ తన సమ్మిళిత దౌత్యంను ముందుకు తీసుకెళ్లినట్లు ఈ శిఖరాగ్ర సమావేశం స్పష్టం చేస్తోంది.

ఈ కూటమితో భారత్‌కు ఎంత ప్రయోజనం?

ఇప్పుడు జరుగుతున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశం కూడా ఉమ్మడి ప్రకటన లేకుండానే ముగుస్తుందేమోనన్న ఆందోళన ఉంది. అదే జరిగితే ఆతిథ్య దేశానికి ఇది ఒక పెద్ద దౌత్య వైఫల్యం అవుతుంది. ఈ పరిస్థితి రాకుండా భారత్‌ ప్రయత్నిస్తోంది. 2021లో భారత్‌ చివరిసారిగా బ్రిక్స్‌ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు అందులో భారత్‌, బ్రెజిల్‌, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా అనే ఐదు దేశాలు మాత్రమే ఉన్నాయి. ఈ దేశాల పేర్ల మొదటి అక్షరాలతో బ్రిక్స్‌ ఏర్పడింది. బ్రిక్స్‌ విస్తరణ తర్వాత కూటమిలో సభ్య దేశాల సంఖ్య, వాటి భౌగోళిక పరిధి, రాజకీయ ప్రయోజనాలు మరింత విస్తరించాయి. ఇరాన్‌, యూఏఈ, ఈజిప్ట్‌, ఇథియోపియా వంటి దేశాల చేరికతో బ్రిక్స్‌ ఇప్పుడు మరింత సంక్లిష్టమైన దౌత్య వేదికగా మారింది. ఒకవైపు రష్యా, చైనాతో భారత్‌కు వ్యూహాత్మక సంబంధాలు కొనసాగుతుండగా.. మరోవైపు పశ్చిమ దేశాలతో కూడా భారత్‌ తన భాగస్వామ్యాలను బలోపేతం చేస్తోంది.

ఒకే వేదికపైకి తీసుకురావడమనేది భారత్‌కు పెద్ద సవాలే

బ్రిక్స్‌ అధ్యక్ష పదవిని భారత్‌ చేపట్టిన కేవలం రెండు నెలలకే అమెరికా, ఇజ్రాయెల్‌ బ్రిక్స్‌ సభ్య దేశమైన ఇరాన్‌పై దాడి చేశాయి. అనంతరం తెహ్రాన్‌ బ్రిక్స్‌ సభ్య దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియాపై ప్రతిదాడులు చేసింది. ఇప్పుడు ఈ మూడు దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడమనేది భారత్‌కు పెద్ద సవాలేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా-ఇరాన్‌ వివాదం బ్రిక్స్‌ దేశాల మధ్య తీవ్రమైన విభేదాలను బయటపెట్టింది. మే నెలలో భారత్‌ ఆతిథ్యం ఇచ్చిన బ్రిక్స్‌ విదేశాంగ మంత్రుల సమావేశం ఉమ్మడి ప్రకటన లేకుండానే ముగిసింది. దీనిని భారత్‌కు దౌత్యపరమైన ఎదురుదెబ్బగా పరిగణించారు. మధ్యప్రాచ్య సంక్షౌభాన్ని ఎలా పరిష్కరించాలనే దానిపై కూటమిలోని సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి.

పుతిన్‌ స్టైల్‌ వైరల్‌.. కోటు విప్పిన తీరు వైరల్‌

బ్రిక్స్‌ సమ్మిట్‌ 2026లో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విమానం నుంచి దిగిన అనంతరం ఆయన తన కోటు-ను విప్పిన తీరు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. పుతిన్‌ హుందాగా, ఎంతో సునాయాసంగా కోటును ఒక్క కదలికతో తొలగించి భద్రతా సిబ్బందికి అందించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. వైరల్‌ వీడియోలో పుతిన్‌ విమానం నుంచి దిగిన తర్వాత తన వాహనం వైపు వెళ్తూ కనిపించారు. కారు ఎక్కే ముందు ఆయన తన కోటు-ను వేగంగా విప్పి పక్కనే ఉన్న భద్రతా సిబ్బందికి అందించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన చూపించిన వేగం, నియంత్రణ, హుందాతనం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 73 ఏళ్ల వయసులోనూ ఆయన చురుకుదనం ఆకట్టుకుంటోందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

వ్లాదిమిర్‌ పుతిన్‌ నడిచే తీరు చర్చనీయాంశం

వ్లాదిమిర్‌ పుతిన్‌ నడిచే తీరు కూడా పలుమార్లు వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆయన నడుస్తున్నప్పుడు కుడి చేతిని తక్కువగా ఊపుతూ, దానిని శరీరానికి దగ్గరగా ఉంచే తీరు పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. పుతిన్‌ మాజీ కేజీబీ అధికారి కావడంతో ఆయన సుదీర్ఘ శిక్షణకు ఈ నడకతో సంబంధం ఉందనే వివరణలు గతంలో ప్రచారంలోకి వచ్చాయి. పుతిన్‌ శైలిపై చర్చ సందర్భంగా ఆయన కేజీబీ నేపథ్యాన్ని కూడా నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. అయితే, కుడిచేతి కదలిక లేదా కోటు విప్పే విధానం నేరుగా కేజీబీ శిక్షణ వల్లే వచ్చిందని నిర్ధారించే ఆధారాలు లేవు. గతంలో ప్రచురితమైన కొన్ని కథనాల్లో మాత్రం ఆయన నడకను శారీరక అలవాట్లు, శిక్షణతో అనుసంధానించే ప్రయత్నాలు జరిగాయి. ఏదేమైనా.. రాజకీయ సమావేశాలపై సాధారణంగా దృష్టి సారించే పుతిన్‌ తాజా పర్యటనలో ఆయన కోటు విప్పిన చిన్న వీడియోనే ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. బ్రిక్స్‌ సమ్మిట్‌కు సంబంధించిన రాజకీయ పరిణామాలతో పాటు పుతిన్‌ ప్రత్యేక శైలిపై కూడా నెటిజన్లు ఆసక్తికరంగా చర్చిస్తున్నారు.

BRICS Summit 2026