BREAKING | అయోధ్య రామమందిరం ట్రస్ట్‌ సీఈవోగా జితేంద్ర మిశ్రా

  • 39 ఏళ్ల వైమానిక దళ అనుభవంతో కీలక బాధ్యతలు..

అయోధ్య, ఆంధ్రప్రభ : అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రామమందిర నిర్వహణ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో)గా రిటైర్డ్‌ ఎయిర్‌ మార్షల్‌ జితేంద్ర మిశ్రాను నియమించింది. ట్రస్ట్‌ నిర్వహించిన కీలక సమావేశంలో ఈ నియామకానికి ఆమోదం తెలిపిపింది. ఆలయ పరిపాలన, భక్తుల సౌకర్యాలు, వివిధ విభాగాల సమన్వయ బాధ్యతలను ఇకపై జితేంద్ర మిశ్రా పర్యవేక్షించనున్నారు.

సీఈవో ఎంపిక కోసం ట్రస్ట్‌ చేపట్టిన ప్రక్రియలో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 5,585 మంది అభ్యర్థులు ఈ ప్రతిష్ఠాత్మక పదవికి దరఖాస్తు చేసుకోగా.. పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేశారు. ప్రత్యేక కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించి తుది జాబితాను సిద్ధం చేసింది. పరిపాలనా అనుభవం, నాయకత్వ లక్షణాలు, భారీ వ్యవస్థలను నిర్వహించే సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుని జితేంద్ర మిశ్రా పేరును పరిశీలించినట్లు తెలుస్తోంది.

జితేంద్ర మిశ్రా భారత వైమానిక దళంలో 39 ఏళ్ల పాటు సేవలందించారు. వివిధ కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయనకు పరిపాలన, నిర్వహణ, సమన్వయ వ్యవహారాల్లో విస్తృత అనుభవం ఉంది. సైనిక రంగంలో క్రమశిక్షణతో కూడిన నాయకత్వాన్ని ప్రదర్శించిన ఆయన.. ఇప్పుడు అయోధ్య రామమందిర ట్రస్ట్‌ తొలి సీఈవోగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

రామమందిర నిర్మాణం పూర్తయి భక్తుల రాక పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ నిర్వహణకు మరింత సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థ అవసరమని ట్రస్ట్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి సీఈవో నియామకానికి శ్రీకారం చుట్టింది. ఆలయ నిర్వహణ, పరిపాలనా వ్యవహారాలు, ఆర్థిక వ్యవస్థ, నిబంధనల అమలు వంటి అంశాలను సీఈవో పర్యవేక్షించనున్నారు.

సీఈవో అధికారాలపై ట్రస్ట్‌ డీడ్‌లో మార్పులు

బుధవారం జరిగే ట్రస్ట్‌ సమావేశంలో సీఈవో నియామకంతో పాటు ట్రస్ట్‌ డీడ్‌లో సవరణల అంశం కూడా చర్చకు రానుంది. 2020 ఫిబ్రవరి 5న ట్రస్ట్‌ ఏర్పాటైన తర్వాత తొలిసారిగా డీడ్‌లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. మొత్తం 12 అంశాలతో కూడిన అజెండాలో సీఈవో అధికారాలు, బాధ్యతలను స్పష్టంగా పేర్కొనే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది.

సీఈవోకు విస్తృత పరిపాలనా అధికారాలు అప్పగించే అవకాశం ఉంది. ఆలయ నిర్వహణకు సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడం, వివిధ విభాగాల మధ్య సమన్వయం, ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణ, నిబంధనల అమలు వంటి బాధ్యతలు ఆయన పరిధిలో ఉండనున్నాయి. ప్రభుత్వ జోక్యం లేకుండా ట్రస్ట్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా సీఈవో పనిచేస్తారని ట్రస్ట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా కూడా ఆలయ నిర్వహణలో పూర్తి స్థాయి సీఈవో అవసరమని గతంలో పేర్కొన్నారు. ఆలయ కార్యకలాపాలను వృత్తిపరమైన విధానంలో నిర్వహించేందుకు, పారదర్శకతను పెంచేందుకు ఈ నియామకం కీలకంగా మారుతుందని తెలిపారు.

భద్రతా కమిటీ, అధికార ప్రతినిధి నియామకంపైనా చర్చ

ట్రస్ట్‌ సమావేశంలో ఆలయ భద్రతకు సంబంధించి శాశ్వత స్థానిక భద్రతా సమన్వయ కమిటీ ఏర్పాటు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేసేలా ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే ట్రస్ట్‌కు అధికారిక మీడియా ప్రతినిధిని నియమించే అంశం కూడా సమావేశ అజెండాలో ఉంది. గత కొంతకాలంగా ఈ నియామకం పెండింగ్‌లో ఉంది. ఆలయానికి సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా వెల్లడించేందుకు ఈ నియామకం అవసరమని ట్రస్ట్‌ భావిస్తోంది.

విరాళాల వ్యవహారంపైనా సమీక్ష

ఇటీవల ఆలయంలో భక్తుల విరాళాలకు సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ పురోగతిపైనా ట్రస్ట్‌ సమావేశంలో సమీక్ష జరగనుంది. విరాళాల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

విరాళాల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్‌ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌, ట్రస్టీ అనిల్‌ మిశ్రా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత జరుగుతున్న కీలక సమావేశం కావడంతో సీఈవో నియామకం, ట్రస్ట్‌ డీడ్‌ సవరణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మొత్తంగా అయోధ్య రామమందిర ట్రస్ట్‌లో పరిపాలనా వ్యవస్థకు కొత్త రూపం ఇవ్వడంలో తొలి సీఈవో నియామకం కీలక మలుపుగా మారనుంది. జితేంద్ర మిశ్రా ఎంపిక ఖరారైతే.. ఆలయ నిర్వహణలో సైనిక క్రమశిక్షణ, వృత్తిపరమైన పరిపాలనా విధానాలకు ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది.