BREAKING | బేతుపల్లి ప్రాజెక్టులో ఐదుగురు మత్స్యకారులు సురక్షితం
- కొనసాగుతున్న గాలింపు
సత్తుపల్లి, ఆంధ్రప్రభ :
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి ప్రాజెక్టులో గల్లంతైన వారిలో ఐదుగురు మత్స్యకారులను ఎన్డీఆర్ఎఫ్ బృందం సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఇంకా ఆరుగురు చెరువులో చిక్కుకున్నట్లు సమాచారం. వారిని గుర్తించి రక్షించేందుకు సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బేతుపల్లి ప్రాజెక్టులో వరద ఉధృతి పెరిగింది. చేపల కోసం మత్స్యకారుల సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన వల వరద ఉధృతికి కొట్టుకుపోతుందన్న ఆందోళనతో పది మంది మత్స్యకారులు చెరువులోకి వెళ్లారు. అయితే నీటి ప్రవాహం పెరగడంతో వారు తిరిగి రావడం కష్టమైంది. సమాచారం అందుకున్న అధికారులు ప్రత్యేక పడవలతో పది మందితో కూడిన రెస్క్యూ బృందాన్ని పంపారు. ఈ క్రమంలో మత్స్యకారుల్లో ముగ్గురు మాత్రమే తిరిగి ఒడ్డుకు చేరుకున్నారు.
మిగిలిన వారి కోసం గాలిస్తున్న రెస్క్యూ బృందం ప్రయాణిస్తున్న పడవ చెరువు మధ్యలో బోల్తా పడటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. దీంతో మత్స్యకారులతో పాటు సహాయక బృందంలోని సభ్యుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. సమాచారం అందుకున్న కలెక్టర్, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
రాత్రి పది గంటల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. తాజాగా ఐదుగురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. మరో ఆరుగురు ఇంకా చెరువులో ఉన్నట్లు సమాచారం రావడంతో వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
