Brazil-Election : గేమ్ చేంజ్ ..!,,Andhra Prabha Top Story

Brazil-Election : గేమ్ చేంజ్ ..!,,Andhra Prabha Top Story

  • లులాకు షాక్
  • కాంగ్రెస్‌పై బోల్సొనారో పట్టు
  • తండ్రికి క్షమాభిక్షే ఫ్లావియో లక్ష్యం
  • బ్రెజిల్ గ్యారేజీలో.. ప్లావియో పాగా
  • సెనేట్‌, దిగువ సభలో లిబరల్‌ పార్టీకి భారీ బలం
  • రన్‌ఆఫ్‌లో లులా గెలిచినా.. పాలన అంత ఈజీ కాదు

(బ్రసీలియా, ఆంధ్రప్రభ ప్రతినిధి )

బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల తొలి విడతలో మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో కుమారుడు, సెనేటర్‌ ఫ్లావియో బోల్సొనారో దూకుడు చూపిస్తే.. అదే సమయంలో ఆయనకు మిత‌వాద లిబరల్‌ పార్టీ పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. సెనేట్‌, దిగువ సభ రెండింటిలోనూ అత్యధిక సింగిల్‌ పార్టీ ప్రాతినిధ్యం సాధించి అతిపెద్ద విజేతగా అవతరించింది. దీంతో అక్టోబర్‌ 25న జరిగే అధ్యక్ష రన్‌ఆఫ్‌ మరింత ఆసక్తికరంగా మారింది. తొలి విడత అధ్యక్ష ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన ఫ్లావియో బోల్సొనారో.. ఇప్పుడు వామ‌పక్ష నేత, ప్రస్తుత అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లులా డ సిల్వాతో తుది పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లోనూ తనకు అనుకూల బలం పెరగడం ఆయనకు కలిసొచ్చే అంశంగా మారింది.

సెనేట్‌లో భారీ దూకుడు

ఎన్నికల ప్రచార సమయంలో ఫ్లావియో బోల్సొనారో తనకు అనుకూలంగా ఉన్న సెనేట్‌ అభ్యర్థుల కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ ప్రయత్నానికి ఇప్పుడు ఫలితం కనిపించింది. బోల్సొనారో కుటుంబానికి రాజకీయంగా కీలకమైన లిబరల్‌ పార్టీ సెనేట్‌లో తన బలాన్ని 15 స్థానాల నుంచి ఏకంగా 28 స్థానాలకు పెంచుకుంది.
1980ల చివర్లో బ్రెజిల్‌లో ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరించిన తర్వాత ఒకే పార్టీ సాధించిన అత్యుత్తమ ఫలితాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

దిగువ సభలోనూ లిబరల్‌ పార్టీ దూసుకెళ్లింది. ప్రస్తుతం ఉన్న 98 స్థానాల నుంచి 121 స్థానాలకు పెరిగే అవకాశం ఉందని అంచనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు ఇతర మధ్యేవాద, కుడిపక్ష పార్టీలను కలుపుకుంటే దిగువ సభలో దాదాపు 250 స్థానాలు, సెనేట్‌లో 30కి పైగా స్థానాలు బోల్సొనారో అనుకూల శిబిరం ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

తండ్రికి క్షమాభిక్షే లక్ష్యమా?

పార్లమెంట్‌లో అనుకూల బలం ఏర్పడితే ఫ్లావియో బోల్సొనారో ముందున్న ప్రధాన రాజకీయ లక్ష్యాల్లో ఒకదానికి మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది. 2022 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరుగుబాటుకు కుట్ర పన్నారన్న కేసులో మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష విధించారు.తన తండ్రికి క్షమాభిక్ష కల్పించాలన్నది ఫ్లావియో రాజకీయ లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. ఇప్పుడు పార్లమెంట్‌లో బోల్సొనారో అనుకూల శక్తులు బలపడితే.. ఆ ప్రయత్నానికి రాజకీయంగా ఊతం లభించే అవకాశముంది.అంతేకాదు.. బోల్సొనారో అనుకూల సెనేటర్ల సంఖ్య మరింత పెరిగితే, ఆయన తండ్రికి శిక్ష విధించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అభిశంసన ప్రక్రియకు అవసరమైన 54 ఓట్ల గడువుకు కూడా ఆ శిబిరం చేరువ కావచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.

‘మార్పు కోసం ప్రజలు ఓటేశారు’

ఎన్నికల ఫలితాల అనంతరం ఫ్లావియో బోల్సొనారో తన మద్దతుదారుల్లో ఉత్సాహం నింపేలా స్పందించారు.మార్పు కోరుకున్న బ్రెజిల్‌ ప్రజలు తమ గొంతు వినిపించేందుకు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు రాజకీయాలకు దూరంగా ఉండకుండా తమ అభిప్రాయాన్ని ఓటు ద్వారా వెల్లడించారని అన్నారు.

లులాకు ముందుంది అసలు సవాలు

అధ్యక్ష ఎన్నికల్లో రెండో విడతలో లులా గెలిచినా.. తదుపరి పాలన అంత సులభంగా సాగే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్లమెంట్‌లో బలమైన కుడిపక్ష కూటమి ఉంటే.. ప్రభుత్వ ప్రతిపాదనలకు, చట్టసభ వ్యవహారాలకు తరచూ అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.శాసన వ్యవహారాలను పర్యవేక్షించే DIAP సంస్థ అధిపతి న్యూరిబెర్గ్‌ డయాస్‌ ప్రకారం.. తదుపరి అధ్యక్షుడికి పాలన పెద్ద సవాలుగా మారనుంది. కుడిపక్ష కూటమి చట్టాల ఆమోదాన్ని అడ్డుకోవడంతో పాటు ప్రభుత్వ పనితీరుపైనా ప్రభావం చూపే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.

లులాకూ ఎదురైన అనుభవమే..

కాంగ్రెస్‌లో తగినంత మద్దతు లేకపోతే అధ్యక్షుడి పాలనకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో లులా ఇప్పటికే చూశారు. గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లులా ప్రతిపాదించిన వ్యక్తిని సెనేట్‌ తిరస్కరించింది. కేంద్ర-కుడిపక్ష సెనేట్‌ అధ్యక్షుడు డేవి అల్కొలుంబ్రేతో ఉన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతేకాదు.. 2023 జనవరిలో తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లులా విధించిన అనేక వీటోలను కాంగ్రెస్‌ కొట్టివేసింది. శాసనసభ తన అధికార పరిధిని ఎంతగా విస్తరించుకుంటోందో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

బోల్సొనారోకూ తప్పలేదు..

కాంగ్రెస్‌ నుంచి ఎదురయ్యే ప్రతిఘటన లులాకు మాత్రమే కొత్త కాదు. గతంలో జైర్‌ బోల్సొనారో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఆయనకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తుపాకీ నియంత్రణ నిబంధనలను సడలించడం, ఎన్నికల్లో పేపర్‌ బ్యాలెట్‌ ధ్రువీకరణ వ్యవస్థను ప్రవేశపెట్టడం వంటి కీలక ప్రతిపాదనలకు కాంగ్రెస్‌ నుంచి మద్దతు లభించలేదు. ఇప్పుడు పరిస్థితి మరో మలుపు తిరిగింది. అధ్యక్ష పీఠం కోసం ఫ్లావియో బోల్సొనారో లులాతో తలపడుతుండగా.. పార్లమెంట్‌లోనూ ఆయన శిబిరం బలం గణనీయంగా పెరిగింది. దీంతో అక్టోబర్‌ 25న జరిగే అధ్యక్ష రన్‌ఆఫ్‌ ఫలితం మాత్రమే కాదు.. ఆ తర్వాత బ్రెజిల్‌ను ఎవరు ఎలా పాలిస్తారన్నదీ ఆసక్తిక‌రంగా మారింది.

ఫ్లావియో కు కయాడో, జెమా మద్దతు

రియో డి జనీరో/సావో పాలో, అక్టోబర్‌ 5 (ఆంధ్రప్రభ ప్రతినిధి బాబు బహదూర్): బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన తొలి విడత ఎన్నికల్లో అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాతో హోరాహోరీగా నిలిచిన సెనేటర్ ఫ్లావియో బోల్సొనారోకు కుడిపక్ష నేతల నుంచి మద్దతు లభించింది. తొలి విడతలో తనతో పోటీ చేసిన ఇద్దరు ప్రముఖ కుడిపక్ష నాయకులు రొనాల్డో కయాడో, రోమ్యూ జెమా.. రన్‌ఆఫ్‌లో బోల్సొనారోకు మద్దతు ప్రకటించారు.

గోయాస్‌ రాష్ట్ర మాజీ గవర్నర్‌ రొనాల్డో కయాడో ఆదివారం ఎన్నికల్లో 2.18 శాతం చెల్లుబాటు అయ్యే ఓట్లు సాధించారు. మినాస్‌ జెరైస్‌ మాజీ గవర్నర్‌ రోమ్యూ జెమాకు 0.27 శాతం ఓట్లు వచ్చాయి. లులా, బోల్సొనారో తర్వాత ఇతర అభ్యర్థులతో పోలిస్తే వీరిద్దరికీ గణనీయమైన ఓటు శాతం దక్కింది.

కయాడోకు చెందిన PSD పార్టీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఆయన బోల్సొనారోతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అధికారికంగా తన మద్దతును ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు NOVO పార్టీకి చెందిన జెమా ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా బోల్సొనారోకు తన మద్దతును ప్రకటించారు తొలి విడతలో పోటీ చేసిన ఇతర అభ్యర్థుల్లో రచయిత, మానసిక వైద్య నిపుణుడు ఆగస్టో క్యూరీ, రెనాన్ సాంటోస్ మాత్రం లులాకు గానీ, బోల్సొనారోకు గానీ మద్దతు ప్రకటించలేదు. వీరిలో క్యూరీకి 2.89 శాతం, సాంటోస్‌కు 2.24 శాతం ఓట్లు లభించాయి.

స్వల్ప ఆధిక్యంతో బోల్సొనారో

ఆదివారం జరిగిన తొలి విడత ఎన్నికల్లో బోల్సొనారో అనూహ్యంగా మెరుగైన ప్రదర్శన కనబరిచారు. లులాపై స్వల్ప ఆధిక్యాన్ని సాధించారు. దీంతో ఈ నెల 25న జరగనున్న తుది పోరుపై ఉత్కంఠ మరింత పెరిగింది. తొలి విడతలో వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే.. అధ్యక్ష పీఠం కోసం లులా, బోల్సొనారో మధ్య పోరు నువ్వా.. నేనా అన్నట్టుగా మారింది. ఇప్పుడు తొలి విడతలో పోటీ చేసి ఓట్లు సాధించిన ఇతర నేతల మద్దతు ఎటువైపు మళ్లుతుందన్నది తుది ఫలితాలను ప్రభావితం చేసే అంశంగా మారింది. కుడిపక్ష ఓట్లను బోల్సొనారో ఏ మేరకు తనవైపు తిప్పుకోగలరన్నది అక్టోబర్‌ 25 రన్‌ఆఫ్‌లో కీలకంగా మారనుంది.