Brazier Accident : ప్చ్.. చలి కుంపటి
వృద్ధురాలు సజీవ దహనం
10 ఇళ్లు అగ్నికి ఆహుతి
కట్టుబట్టలతో బాధితులు కన్నీళ్లు
( ఆంధ్రప్రభ, విజయనగరం బ్యూరో)
చలి కుంపటి ఓ ఊరిని (Fire Accident) తగలబెట్టింది. ఓ వృద్ధురాలిని దహించివేసింది. అందరూ నిరుపేదలే.. కాయకష్టం చేసి.. అలసి సొలసి నిద్దరోతున్న వేళ.. ఆ పది కుటుంబాలను మృత్యువు కాటేసింది. జనం అప్రమత్తం కావటంతో.. కేవలం ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ దైన్య దృశ్యం.. విజయనగరం జిల్లా తెర్లాం మండలంలో కొరటాం గ్రామపంచాయతీలో శివారు గ్రామం సీతారాంపురం చిన గొలుగువలస (China Golusu valasa) లో కాళరాత్రిని ఆవిష్కరించింది.

ఈ గ్రామానికి చెందిన పాపమ్మ (65) (Papamma) వృద్ధురాలు చలి తీవ్రతను తట్టుకోలేక ఉపశమనం కోసం రాత్రి ఇంట్లో కుంపటి (Brazier) పెట్టుకుని నిద్రించింది. రాత్రి 11 గంటలకు ఊరిజనం నిద్రకు ఉపక్రమించిన వేళ.. కుంపటి నుంచి నిప్పురవ్వలు పక్కనే గడ్డి పై పడ్డాయి. అంతలోనే మంటలు రాజుకుని చెలరేగాయి. నిద్రలోని పాపమ్మ మంటల నుంచి బయటపడలేక సజీవదహం (Dead Alive) కాగ.. ఈ మంటలు శర వేగంగా పూరిళ్లకు వ్యాపించాయి. స్థానికులు నిద్ర లేచి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.

ఈ అగ్నిప్రమాదంలో 10 ఇల్లు (10 Houses Fired) కాలిపోయాయి. జనానికి బూడిదే మిగిలింది. ప్రమాద స్థలానికి తెర్లాం ఎస్ ఐ జి సాగర్ బాబు చేరుకున్నారు. రాజాం అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకునే నష్టం జరిగిపోయింది. ఈ పది కుటుంబాలు కట్టుబట్టలతో వీధిపాలయ్యాయి.

