విజయవాడలో బ్రాహ్మణి సందడి!
- ‘వసంతం-2026’ హస్తకళలు, చేనేత వస్త్రాల ప్రదర్శన ప్రారంభం
- దేశవ్యాప్తంగా మాస్టర్ ఆర్టిజన్లు, నేతన్నల ఉత్పత్తులకు ప్రత్యేక వేదిక
- సంప్రదాయ కళలను భావితరాలకు అందించాలి: నారా బ్రాహ్మణి
విజయవాడ, నవంబర్ 2 (ఆంధ్రప్రభ): సంప్రదాయ కళలు, చేనేత వస్త్రాలకు ప్రోత్సాహం అందించడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కళాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే లక్ష్యంతో విజయవాడలో ‘వసంతం-2026’ ప్రదర్శన ప్రారంభమైంది. క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సీసీఏపీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హస్తకళలు, చేనేత వస్త్రాల ప్రదర్శన, విక్రయ కార్యక్రమాన్ని నారా బ్రాహ్మణి సోమవారం ప్రారంభించారు.

విజయవాడలోని ఎంజీ రోడ్డులో ఉన్న శ్రీ శేషసాయి కల్యాణ వేదికలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో వివిధ ప్రాంతాలకు చెందిన నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు, చేనేత కార్మికులు రూపొందించిన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. అనంతరం ఆమె వివిధ స్టాళ్లను సందర్శించి అక్కడి హస్తకళా వస్తువులు, చేనేత ఉత్పత్తులను పరిశీలించారు.

ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న మాస్టర్ ఆర్టిజన్లు, చేనేత కార్మికుల అద్భుతమైన ప్రతిభను, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఒకే వేదికపై ప్రదర్శించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి హస్తకళ వెనుక కళాకారుల నైపుణ్యం, శ్రమ, తరతరాలుగా వస్తున్న సంప్రదాయం దాగి ఉంటుందని అన్నారు.

మన సంప్రదాయ కళారూపాలను భావితరాలకు అందించాలంటే స్థానిక హస్తకళాకారులు, చేనేత కార్మికులను ప్రోత్సహించడం ఎంతో కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు. చేనేత, హస్తకళా ఉత్పత్తులకు ప్రజల్లో ఆదరణ పెరిగినప్పుడే ఈ రంగాలపై ఆధారపడిన కళాకారులకు ఆర్థికంగా భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. విజయవాడ ప్రజలు ఈ ప్రదర్శనను సందర్శించి, స్థానిక కళాకారులు, నేతన్నలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

రెండు రోజుల పాటు ప్రదర్శన
‘వసంతం-2026’ ప్రదర్శన నవంబర్ 2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు కొనసాగనుంది. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. చేనేత వస్త్రాలు, విభిన్న హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ప్రజలకు ఇది మంచి అవకాశంగా నిలవనుంది.
