తెలంగాణ ఉద్యమానికి ఊపు..
2011లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసిన అత్యంత శక్తివంతమైన ప్రజా ఉద్యమాల్లో జరిగిన సకల జనుల సమ్మె (Sakala Janula Samme) ఒకటి. ఆగస్టు 2011లో ప్రారంభమైన ఈ సమ్మె రెండు నెలలపాటు కొనసాగింది. విద్యుత్, నీటి సరఫరా, రవాణా, విద్య, కోల్, ప్రభుత్వ కార్యాలయాలు – ఒక్క రంగమూ మిగల్లేదు. ప్రతి రంగానికీ చెందిన ఉద్యోగులు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, మహిళలు ఏకతాటిపైకి వచ్చి సమ్మెలో పాల్గొన్నారు.
హైదరాబాద్ (Hyderabad) సహా మొత్తం తెలంగాణ ప్రాంతం దాదాపు నిలిచిపోయింది. కోల్ బెల్ట్‌లో ఉత్పత్తి ఆగిపోవడంతో విద్యుత్ సరఫరా తీవ్రంగా దెబ్బతింది. RTC బస్సులు రోడ్లపై కనిపించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ఇబ్బందులన్నీ భరించి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు తమ ఐక్యతను చాటుకున్నారు.
కేటీఆర్ ట్వీట్…
తెలంగాణ ఉద్యమం (Telangana movement) లో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మె స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. సమాజంలోని ప్రతి వర్గం సమ్మెలో చేరడంతో దీన్ని “సకల జనుల సమ్మె” అని పిలిచారు. ఈ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనకు పెద్ద ఊతమిచ్చి, 2014లో ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావానికి మార్గం సుగమం చేసింది. 14 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈరోజు, ఆ సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు గుర్తుచేసుకుంటూ “మనం చేసిన త్యాగాలు, కష్టాలు వృథా కాలేదు” అని గర్వపడుతున్నారు.
”తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిన మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె. సబ్బండ వర్గాల ప్రజలు ఏకమై, 42 రోజుల పాటు శాంతియుతంగా నిరసన (Peaceful protest) తెలిపి, తెలంగాణ సెగను ఢిల్లీకి తాకేలా చేసిన మహోన్నత ఘట్టం సకల జనుల సమ్మె. సెప్టెంబర్ 12, 2011 రోజున కరీంనగర్ (Karimnagar) జనగర్జనలో ఉద్యమ సారథి కేసీఆర్ (KCR) పిలుపు మేరకు యావత్ తెలంగాణ సమాజం ఒక్కటయ్యింది.
సమ్మెలో స్వచ్చంధంగా భాగస్వాములయ్యి, ఔర్ ఏక్ ధక్కా.. తెలంగాణ పక్కా అని దిక్కులు పిక్కటిల్లేలా తెలంగాణ ప్రజలు (Telangana People ) నినదించారు. నిర్బంధాలను ఛేదించి, ఆంక్షలకు ఎదురొడ్డి, బెదిరింపులను లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ బిడ్డలు పోరాడారు. సకల జనుల సమ్మెకు నేటితో 14 ఏళ్ళు నిండిన సందర్భంగా.. సమ్మెలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. జై తెలంగాణ” అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.

