బొండా సిద్ధార్థ ఇంటింటి ప్రచారం
పాయకాపురం, ఆంధ్రప్రభ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 85వ డివిజన్ రాజీవ్‌నగర్‌లో శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాజీవ్‌నగర్ దుర్గాదేవి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆయన స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నాయకత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 29 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమిని మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు, అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం, స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడం లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వట్టే వెంకటేశ్వరరావు, పెద్ది శ్రీను, సి.హెచ్. రవి, బి. దుర్గారావు, ఇజ్జు అచ్యుత్‌రావు, అయ్యప్ప, మిరాభి తదితరులు పాల్గొన్నారు.
