బ‌స్సుపై బాంబు దాడి.. 33 మంది మృతి !

కీవ్‌, ఆంధ్రప్రభ : ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రతరం అవుతున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్‌ ప్రాంతంలో రష్యా జరిపిన దాడుల్లో కనీసం 33 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 18 మంది గాయపడ్డారు. ఫ్రంట్‌లైన్‌ నగరమైన క్రమ్రటోర్స్క్‌లో ప్రయాణికులతో వెళ్తున్న రెండు పౌర బస్సులపై రష్యా గ్లైడ్‌ బాంబులతో దాడి చేసింది. ఈ ఘటనలో 30 మంది మరణించారు. మరో 18 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. దాడి కారణంగా రెండు బస్సులతో పాటు చుట్టుపక్కల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. క్రమ్రటోర్స్క్‌ కమ్యూనిటీలోని బిలెంకే గ్రామంలో రష్యా జరిపిన షెల్లింగ్‌లో మరో ముగ్గురు మరణించినట్లు డొనెట్స్క్‌ ప్రాంతీయ గవర్నర్‌ వాదిమ్‌ ఫిలాష్కిన్‌ వెల్లడించారు.

ప్రయాణికులతో వెళ్తున్న బస్సులనే రష్యా లక్ష్యంగా చేసుకుందని ఫిలాష్కిన్‌ ఆరోపించారు. వీలైనంత ఎక్కువ మంది పౌరులను హతమార్చడమే లక్ష్యంగా దాడి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక ప్రాసిక్యూటర్లు విడుదల చేసిన చిత్రాల్లో పేలిపోయి కాలిపోయిన బస్సు అవశేషాలు, రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న శిథిలాలు, బాధితుల దృశ్యాలు కనిపించాయి. ఘటన అనంతరం తూర్పు ప్రాంతంలో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఫిలాష్కిన్‌ సూచించారు. క్రమ్రటోర్స్క్‌, సమీపంలోని స్లోవ్యాన్స్క్‌లో భద్రతా పరిస్థితులు మరింత దిగజారడంతో అన్ని ప్రజా రవాణా సేవలను నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రయాణికులు, డ్రైవర్ల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.

క్రమ్రటోర్స్క్‌, స్లోవ్యాన్స్క్‌ ప్రాంతాలు రష్యా ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్న డాన్‌బాస్‌ ప్రాంతంలోని కీలక ప్రాంతాల్లో ఉన్నాయి. ఉక్రెయిన్‌ పారిశ్రామిక ప్రాంతమైన డాన్‌బాస్‌పై పూర్తిస్థాయి నియంత్రణ సాధించాలన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ లక్ష్యంలో భాగంగా ఈ ప్రాంతాలకు ప్రాధాన్యం ఉంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి క్రమ్రటోర్స్క్‌ ఉక్రెయిన్‌ సైన్యానికి లాజిస్టిక్స్‌, సరఫరా కేంద్రంగా వ్యవహరించింది. అయితే రష్యా బలగాలు తూర్పు దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఈ నగరంపై దాదాపు ప్రతిరోజూ దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా గ్లైడ్‌ బాంబులను క్రమ్రటోర్స్క్‌, స్లోవ్యాన్స్క్‌పై ప్రయోగిస్తున్నారు. ఈ బాంబులకు ప్రత్యేక రెక్కల వంటి భాగాలను అమర్చడం వల్ల అవి సాధారణ బాంబుల మాదిరిగా నేరుగా కిందపడకుండా కొంత దూరం గ్లైడ్‌ అవుతూ లక్ష్యాన్ని చేరుకుంటాయి. ఆగస్టు చివర్లో ఒక్క రోజే క్రమ్రటోర్స్క్‌పై తొమ్మిది వరకు గ్లైడ్‌ బాంబులు ప్రయోగించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

క్రమ్రటోర్స్క్‌ నగర మండలి ఈ దాడిని పౌరులపై జరిగిన తీవ్రమైన నేరంగా అభివర్ణించింది. అక్కడ ఎలాంటి సైనిక లక్ష్యాలు లేవని, అయినప్పటికీ రష్యా బలగాలు పౌరులు ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించింది. ఈ దాడిపై రష్యా నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు. మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ స్పందిస్తూ.. ఈ దాడికి ప్రతిస్పందన తప్పదని పేర్కొన్నారు. డాన్‌బాస్‌లోని జీవనాన్ని పూర్తిగా నాశనం చేయాలని రష్యా ప్రయత్నిస్తోందని ఆరోపించిన ఆయన.. అంతర్జాతీయ సమాజం దీనిపై స్పందించాలని కోరారు.

ఇదిలా ఉండగా.. కీవ్‌కు తూర్పున ఉన్న ప్రిలుకీ పట్టణంలో బుధవారం రష్యా ఖ్‌-101 క్షిపణితో ఐదు అంతస్తుల నివాస భవనంపై దాడి చేసిన ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. వారిలో ముగ్గురు కేవలం ఏడాది వయసున్న పిల్లలేనని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 54 మంది గాయపడగా.. వారిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. భవనంలో సహాయక చర్యలు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై బ్రిటన్‌ విదేశాంగ మంత్రి ఎడ్‌ మిలిబాండ్‌ తీవ్రంగా స్పందించారు. కీవ్‌లో జెలెన్‌స్కీని కలిసిన ఆయన.. ప్రిలుకీ దాడి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉద్దేశాలను, యుద్ధ వ్యూహాన్ని చూపిస్తోందని పేర్కొన్నారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించనున్నట్లు ప్రకటించారు. రష్యా యుద్ధ యంత్రాంగం, షాడో ఫ్లీట్‌, చమురు సంస్థలు, క్రిప్టో, యుద్ధానికి నిధులు సమకూర్చే వ్యవస్థలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని జెలెన్‌స్కీకి హామీ ఇచ్చారు.

మరోవైపు రష్యా దాడులు రాజధాని కీవ్‌పైనా కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన దాడుల్లో ముగ్గురు మరణించగా.. 14 మంది గాయపడ్డారని కీవ్‌ మేయర్‌ విటాలి క్లిట్ష్కో తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. వరుస వైమానిక దాడుల కారణంగా పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులను షెల్టర్లకు తరలించాల్సి వస్తోంది. వ్యాపార సంస్థలు మూతపడుతున్నాయి. ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌ విద్యుత్‌ మౌలిక వసతులపై రష్యా దాడులు కొనసాగుతుండటంతో విద్యుత్‌ కోతలు పెరిగాయి. దీంతో రాజధానిలో నీటి సరఫరాపైనా ప్రభావం పడుతోంది. విద్యుత్‌ కోతల కారణంగా నగరంలోని కుడి ఒడ్డున నీటి ఒత్తిడి తగ్గుతున్నట్లు స్థానిక నీటి సరఫరా అధికారులు హెచ్చరించారు.

తాజా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మరింత బలమైన వైమానిక రక్షణ వ్యవస్థలు, కొత్త రక్షణ ప్యాకేజీలను అందించాలని జెలెన్‌స్కీ అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలను కోరారు. పెద్ద ఎత్తున రష్యా దాడులు జరగనున్నట్లు ఈ వారంలో తమకు సమాచారం అందిందని ఆయన ముందుగానే హెచ్చరించారు. దీంతో కీవ్‌లో ప్రజలు మెట్రో స్టేషన్లను ఆశ్రయించి రక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం రష్యా దాడుల నుంచి ప్రజలకు ముందస్తు హెచ్చరికలతో పాటు ఆశ్రయ కేంద్రాలే ప్రధాన రక్షణగా మారాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్‌సెప్టర్‌ క్షిపణులకు కొరత ఉండటంతో రష్యా ప్రయోగించే బాలిస్టిక్‌ క్షిపణులను అడ్డుకోవడం ఉక్రెయిన్‌కు సవాలుగా మారింది.

ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టు నాటికే ఉక్రెయిన్‌లో మరణించిన పౌరుల సంఖ్య 2025 మొత్తం ఏడాదిలో నమోదైన పౌర మరణాల కంటే ఎక్కువగా ఉంది. ఇటీవలి నెలల్లో రష్యా, ఉక్రెయిన్‌ రెండూ ఒకదానిపై మరొకటి సుదూర దాడులను తీవ్రతరం చేశాయి. రష్యా దాడుల్లో నివాస భవనాలు, ప్రజా రవాణా వ్యవస్థలు, విద్యుత్‌ మౌలిక వసతులతో పాటు డేటా కేంద్రాలు, లాజిస్టిక్స్‌ గిడ్డంగులు కూడా లక్ష్యాలుగా మారుతున్నాయి. డాన్‌బాస్‌లోని ప్రధాన ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలన్న రష్యా ప్రయత్నాల నేపథ్యంలో క్రమ్రటోర్స్క్‌, స్లోవ్యాన్స్క్‌ చుట్టూ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.