కీసర మున్నేరు పాత బ్రిడ్జి కింద మహిళ మృతదేహం
ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని ఎస్సై విజ్ఞప్తి
కంచికచర్ల, ఆంధ్రప్రభ: కంచికచర్ల మండలం కీసర వద్ద మున్నేరు నదిపై నిరుపయోగంగా ఉన్న పాత బ్రిడ్జి కింద మహిళ మృతదేహం లభ్యమైంది. మంగళవారం మధ్యాహ్నం నదిలో మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
మృతురాలి వయసు సుమారు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమె ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు గళ్ల డిజైన్ ఉన్న పంజాబీ టాప్, ఎరుపు రంగు లెగ్గిన్ ధరించి ఉంది. కుడి చేతిపై ‘కెఎస్‌హెచ్’ అనే అక్షరాలతో పాటు హార్ట్ గుర్తు ఉన్న పచ్చబొట్టు ఉంది. మెడలో తాయత్తు కూడా ఉంది.
మృతదేహం కొంతకాలం నీటిలో ఉండటంతో ఉబ్బిపోయిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వరద నీటికి కొట్టుకొచ్చిందా? ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడవేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిరుపయోగంగా ఉన్న పాత బ్రిడ్జి కింద మృతదేహం లభించడం పట్ల స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కీసర వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలి
మహిళ మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులు వివరాలు వెల్లడించారు. మృతురాలి గురించి ఏమైనా సమాచారం తెలిసిన వారు కంచికచర్ల సబ్‌ఇన్‌స్పెక్టర్ పి. విశ్వనాథ్ 9440796460 నంబర్‌కు లేదా కంచికచర్ల పోలీస్‌స్టేషన్ 0867 8274333 ల్యాండ్‌లైన్ నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.
