Boats-Shortage-Bhavani-Island : భవానీ ద్వీపం వెక్కిళ్లు …:Andhra Prabha Exclusive Story
Boats-Shortage-Bhavani-Island : భవానీ ద్వీపం వెక్కిళ్లు …:Andhra Prabha Exclusive Story
- పాత బోట్లతో కాలాక్షేపం.
- బోటు కోసం పర్యాటకులు పడిగాపులు
- ది బోట్లలో అందుబాటులో నాలుగే
- దసరా వేళ కృష్ణాతీరం వెలవెల..వలవల
- ఫైనల్ థంబ్ నైల్ ఐడియా
- ఒకటి పార్టీలకు.. రెండేసి చిన్న స్పీడ్ బోట్లు
- నెలకు 20 వేలకుపైగా సందర్శకులు..
- ఏటా సుమారు 3 లక్షల మంది పర్యాటకుల రాక

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో )
కృష్ణమ్మ పరవళ్లు.. ప్రకాశం బ్యారేజ్ అందాలు.. ఉండవల్లి గుహల చారిత్రక వైభవం.. అమరావతికి చేరువ.. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధి.. విజయవాడకు పర్యాటకంగా ఇంతటి అనుకూలతలున్నా వాటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. కృష్ణానదిలోని భవాని ఐలాండ్, బేరం పార్క్ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా.. పర్యాటక శాఖలో అధికారులు మారుతున్నా.. ఈ ప్రాంతాల దుస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. పాత బోట్లతోనే నెట్టుకొస్తుండటం, అవసరానికి సరిపడా బోట్లు లేకపోవడం, పర్యవేక్షణ లోపించడంతో పర్యాటకులు బోట్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా పర్యాటక రంగం ద్వారా రావాల్సిన ఆదాయానికి కూడా గండి పడుతోంది.
….బోటు వస్తుందా…

భవాని ఐలాండ్‌కు వెళ్లాలంటే బేరం పార్క్ నుంచి బోటే ఆధారం. కానీ ప్రస్తుతం ఇదే పర్యాటకులకు పెద్ద సమస్యగా మారింది. బేరం పార్క్ వద్ద సుమారు పది పర్యాటక బోట్లు ఉన్నప్పటికీ.. వాటిలో నాలుగు మాత్రమే నామమాత్రంగా అందుబాటులో ఉన్నాయని సమాచారం. ఒక బోటును పార్టీలకు వినియోగిస్తుండగా.. మరో రెండు చిన్న స్పీడ్ బోట్లు పరిమిత సంఖ్యలో ప్రయాణికులకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. సాధారణ పర్యాటకుల కోసం నడిచే పెద్ద బోట్లలో ఒక్కోసారి ఒక్కటే ఆపరేట్ చేస్తుండటంతో రద్దీ సమయాల్లో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. రాకపోకలు సాగించేందుకు పర్యాటకులు వాటికోసం ఎదురుచూస్తూ బోటు వస్తుందా అన్న పరిస్థితి నెలకొంటుంది.
…నెలకు 20 వేల వరకు…

సాధారణ రోజుల్లోనే భవాని ఐలాండ్‌కు నెలకు 20 వేలకుపైగా పర్యాటకులు వస్తున్నారని అంచనా. అంటే ఏడాదికి సుమారు మూడు లక్షల మంది వరకు సందర్శించే అవకాశం ఉంది. దసరా నవరాత్రి ఉత్సవాల సమయంలో ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి మరింత పెరుగుతుంది. గత ఏడాది దుర్గమ్మ దర్శనానికి సుమారు 20 లక్షలకుపైగా భక్తులు వచ్చిన నేపథ్యంలో.. రానున్న ఉత్సవాల్లో సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వీరిలో కనీసం 30 నుంచి 35 శాతం మంది భవాని ఐలాండ్‌ను సందర్శించేందుకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నా.. అందుకు తగ్గట్టుగా బోటింగ్ సదుపాయాలు మాత్రం అందుబాటులో లేవు.
..పాత బోట్లతోనే ప్రయాణం..

ఏటా పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నా.. రద్దీకి అనుగుణంగా కొత్త బోట్లను అందుబాటులోకి తీసుకురావడంపై పర్యాటక శాఖ నుంచి ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదని స్థానికులు, పర్యాటకులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి వినియోగిస్తున్న బోట్లపైనే ఆధారపడటం వల్ల రద్దీ సమయంలో సేవలు విస్తరించలేని పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. ఉన్న బోట్ల నిర్వహణ, సామర్థ్యం, భద్రతపై నిరంతర పర్యవేక్షణతోపాటు కొత్త బోట్ల అవసరాన్ని అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది.
…ఎండీలు మారుతున్నా..
పర్యాటక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు మారుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం పెద్దగా మారడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడం వల్ల బోట్ల నిర్వహణ, సర్వీసుల నిర్వహణ, పర్యాటకుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయని పర్యాటక వర్గాలు చెబుతున్నాయి. పర్యాటకుల నుంచి వచ్చే ఆదాయాన్ని పెంచే అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
…రద్దీ.. ఆదాయానికి దెబ్బ…
దసరా వంటి పండుగల సమయంలో లక్షలాది మంది భక్తులు విజయవాడకు వస్తుంటారు. ఈ సమయంలో భవాని ఐలాండ్, బేరం పార్క్ వద్ద పర్యాటకుల రద్దీ కూడా భారీగా ఉంటుంది. కానీ బోటింగ్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో చాలాసేపు వేచి ఉండాల్సి రావడం.. కొందరు అసంతృప్తితో వెనుదిరగడం జరుగుతోందని పర్యాటకులు చెబుతున్నారు. పర్యాటకుల రాకను ఆదాయంగా మలచుకోవాల్సిన సమయంలో సదుపాయాల కొరత కారణంగా ఆ అవకాశం చేజారుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. భవాని ఐలాండ్, బేరం పార్క్‌లను కేవలం బోటింగ్ కేంద్రాలుగా కాకుండా విజయవాడ పర్యాటక ముఖచిత్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ముందుగా ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ఆధునిక బోట్లను అందుబాటులోకి తీసుకురావాలి. రద్దీ రోజుల్లో అదనపు బోట్లను నడపాలి. బోట్ల నిర్వహణ, భద్రతపై నిరంతర తనిఖీలు చేపట్టాలి. క్షేత్రస్థాయి అధికారుల పనితీరుపై పర్యవేక్షణ పెంచాలి. ఐలాండ్‌లో పర్యాటకులను ఆకట్టుకునే సౌకర్యాలు, కార్యకలాపాలను విస్తరించాలి. కృష్ణమ్మ ఒడిలో ఇంతటి ప్రకృతి అందాలు.. నగరానికి నడిబొడ్డున ఇంతటి పర్యాటక ప్రదేశం.. సమీపంలోనే అమరావతి, ఇంద్రకీలాద్రి, ప్రకాశం బ్యారేజ్, ఉండవల్లి గుహలు ఉన్నా.. పర్యాటకుడు బోటు కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తే అభివృద్ధి ఎక్కడ? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికైనా పర్యాటక శాఖ అధికారులు కాగితాలపై ప్రణాళికలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టి భవాని ఐలాండ్–బేరం పార్క్‌లకు కొత్త కళ తీసుకురావాల్సిన అవసరం ఉంది.
