అది పోలీస్ శాఖ బాధ్యత

తిరుపతి రాయలసీమ బ్యూరో (ఆంధ్రప్రభ): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా (Tirupati District) పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఆశాలత కన్వెన్షన్ హాల్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్‌. సుబ్బరాయుడు ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రక్తదానం ప్రాణదానంతో సమానం. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం పోలీస్ శాఖ బాధ్యత” అని పేర్కొన్నారు.

తిరుపతి, చంద్రగిరి, తిరుమల, రేణిగుంట, పుత్తూరు సబ్‌డివిజన్ల పరిధిలోని పోలీసులు, విద్యార్థులు (Police and students), డ్రైవర్లు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ శిబిరంలో మొత్తం 580 యూనిట్ల రక్తం సేకరించబడింది. సేకరించిన రక్తాన్ని తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి, రుయా ఆసుపత్రి, స్విమ్స్ ఆసుపత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్‌లకు అందజేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రమాద బాధితులు, శస్త్రచికిత్స రోగుల ప్రాణాలను రక్షించడంలో ఈ రక్తం ఎంతో తోడ్పడుతుందన్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజా సేవకే అంకితం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

రక్తదాతలను అభినందిస్తూ.. ఎస్పీ సుబ్బరాయుడు (SP Subbaraidu) ప్రశంసా పత్రాలు అందజేశారు. రక్తదాతలు మాట్లాడుతూ.. అమరవీరుల జ్ఞాపకార్థం రక్తదానం చేయడం గర్వకారణమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు పోలీస్ శాఖ చేసిన ఈ కార్యక్రమం పేద ప్రజలకు పెద్ద సహాయం అవుతుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహర చారి, నాగభూషణరావు, శ్రీనివాసరావు, డిఎస్పీలు వెంకటనారాయణ, శ్రీలత, ప్రసాద్, శ్రీనివాసులు, రామకృష్ణ ఆచారి, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply