Black-Sea-Cargo-Ship-Drone-Attack : కార్గో షిప్‌పై దాడి..! Andhra Prabha Top News
Black-Sea-Cargo-Ship-Drone-Attack : కార్గో షిప్‌పై దాడి..! Andhra Prabha Top News
- ఇద్దరు నావికుల మృతి
- భారతీయుడికి గాయాలు
- నల్లసముద్రంలో రష్యా డ్రోన్ల స్వైర విహారం
- 11 మందిని రక్షించిన రొమేనియా.
- సముద్రంలో మునిగిన ‘ఎంవీ రోయాద్ మమ్మడోవ్’
- తీవ్రంగా ఖండించిన భారత్
- అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళన
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి)
నల్ల సముద్రంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న కార్గో నౌకపై డ్రోన్ దాడి జరిగింది. రష్యాకు చెందిన డ్రోన్లు దాడి చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించగా.. ఈ ఘటనలో ఇద్దరు నావికులు మృతి చెందారు. మరో భారతీయ సిబ్బంది గాయపడ్డారు. దాడి అనంతరం నౌకలో మంటలు చెలరేగి చివరకు సముద్రంలో మునిగిపోయింది. ‘ఎంవీ రోయాద్ మమ్మడోవ్’ అనే కార్గో నౌకలో ముగ్గురు భారతీయులు సహా పలువురు సిబ్బంది ఉన్నారు. ప్రమాదం తర్వాత రొమేనియా అధికారులు 11 మంది సిబ్బందిని రక్షించారు. నౌక రొమేనియా ప్రాదేశిక జలాలకు వెలుపల ఉన్నప్పటికీ.. ఆ దేశ ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్) పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ముగ్గురు భారతీయులు క్షేమం
నౌకలో ఉన్న ముగ్గురు భారతీయులు సురక్షితంగా ఉన్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) స్పష్టం చేసింది. వారిలో ఒకరికి గాయాలు కావడంతో రొమేనియాలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.బుకారెస్ట్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. రొమేనియాలోని కాన్స్టాంచా కౌంటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ సిబ్బందిని రొమేనియాలో భారత రాయబారి మనోజ్ మొహపాత్రా పరామర్శించారు. ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారితోనూ మాట్లాడారు. రొమేనియా అధికారులు, ఆసుపత్రి సిబ్బందితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని.. బాధిత భారతీయ నావికులకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
ఇద్దరు నావికుల మృతి
దాడి తర్వాత నౌకలో భారీగా మంటలు చెలరేగాయి. రొమేనియా అధికారులు 11 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు రొమేనియా అధికారులు వెల్లడించారు.ఆ తర్వాత నౌక నల్ల సముద్రంలో మునిగిపోయింది. రొమేనియా తీరానికి సమీపంలోని స్ఫాంటు గియోర్గేకు దక్షిణంగా సుమారు 30 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
రష్యాపై జెలెన్స్కీ ఆరోపణలు
ఈ దాడికి రష్యానే కారణమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. మొక్కజొన్న సరుకుతో నల్ల సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న పౌర నౌకపై రెండు రష్యా డ్రోన్లు దాడి చేశాయని తెలిపారు.ఈ నౌక టర్కీకి చెందినదని, దానిలో అజర్బైజాన్, భారతీయ పౌరులు సిబ్బందిగా ఉన్నారని జెలెన్స్కీ పేర్కొన్నారు. దాడిలో నౌక కెప్టెన్ కూడా మరణించినట్లు ఆయన వెల్లడించారు.
ఇటలీకి మొక్కజొన్న రవాణా
ఎంవీ రోయాద్ మమ్మడోవ్ మొక్కజొన్నను ఇటలీలోని రావెన్నాకు తరలిస్తోంది. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌక.. అంతకుముందు ఉక్రెయిన్‌లోని ఇజ్మాయిల్ నౌకాశ్రయాన్ని సందర్శించినట్లు నౌకల ట్రాకింగ్ సమాచారం వెల్లడించింది. డాన్యూబ్ నది తీరంలో రొమేనియా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఇజ్మాయిల్.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కీలక మార్గంగా మారింది. యుద్ధం కారణంగా సంప్రదాయ సముద్ర మార్గాలు ప్రమాదకరంగా మారడంతో పశ్చిమ నల్ల సముద్రం మీదుగా వాణిజ్య నౌకల రాకపోకలు పెరిగాయి.
‘వాణిజ్య నౌకలపై దాడులు తీవ్ర ఆందోళన’
ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలు, నావికులను లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర ఆందోళనకరమైన విషయమని విదేశాంగ శాఖ పేర్కొంది.అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించే నౌకలపై దాడులు ప్రపంచ వాణిజ్యాన్ని, ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంక్షేమాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలికేందుకు చర్చలు, దౌత్య మార్గాలనే భారత్ నిరంతరం కోరుకుంటోందని ఎంఈఏ స్పష్టం చేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం తమ దేశాల సరిహద్దులకు దూరంగా ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రతపై ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని భారత్ మరోసారి స్పష్టం చేసింది.
