ఇందిరా పార్క్ వ‌ద్ద బీజేపీ మహాధర్నా

పేద‌ల భూముల జోలికొస్తే ఊరుకోం
నిషేధిత జాబితా నుంచి అర్హమైన ప్రైవేట్‌ భూములను తొలగించాలని డిమాండ్‌
పేదలు, రైతుల భూములపై ప్రభుత్వం అనవసర ఆంక్షలు విధిస్తోందని బీజేపీ ఆరోపణ..
సమస్య పరిష్కారం కాకపోతే అసెంబ్లీ ముట్టడికి సిద్ధమని హెచ్చరిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: భూ భారతి చట్టంలోని సెక్షన్‌ 22ఏ కింద ప్రైవేట్‌ భూములను నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌లో రెండు రోజుల మహాధర్నా ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 5, 6 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ ఆందోళనకు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు, బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీ రఘునంద‌న్‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులతో పాటు 22ఏ నిషేధిత జాబితా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు హాజరయ్యారు. తమ భూములపై ఉన్న ఆంక్షలను తొలగించి, రెవెన్యూ రికార్డుల్లోని సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. పేదలు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులకు చెందిన ప్రైవేట్‌ భూములను సెక్షన్‌ 22ఏ పరిధిలోకి తీసుకురావడం వల్ల ఆస్తుల క్రయవిక్రయాలు, ఇతర లావాదేవీల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. అర్హత ఉన్న భూములను సమగ్రంగా పరిశీలించి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. రెవెన్యూ పోర్టల్‌లో నమోదైన వివరాలను పరిశీలించి, తప్పులు ఉంటే సరిచేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రజల భూముల విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సెక్షన్‌ 22ఏ పరిధిలోకి వచ్చిన భూములన్నింటినీ సమీక్షించి, నిషేధిత జాబితాలో ఉంచాల్సిన అవసరం లేని ఆస్తులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రజల ఆస్తుల విషయంలో గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని బీజేపీ నాయకులు విమర్శించారు. ధరణి వ్యవస్థలో చోటుచేసుకున్న సమస్యలను ప్రస్తావిస్తూ, ఇప్పుడు భూ భారతి, 22ఏ నిబంధనల విషయంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అదే తరహాలో వ్యవహరిస్తోందని ఆరోపించారు. హైడ్రా, ఇతర భూ సంబంధిత చర్యలతో పాటు 22ఏ నిషేధిత జాబితా కారణంగా ప్రజల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు.

ప్రజల భూములపై ప్రభుత్వానికి ఆసక్తి చూపడం సరికాదని, భూ సమస్యలను పారదర్శకంగా పరిష్కరించాలని బీజేపీ నాయకులు అన్నారు. భూముల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నాయని వారు ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజల భూములపై ఉన్న విధానమే భవిష్యత్తులో రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.

సెక్షన్‌ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చిన భూములపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించి, వాస్తవ యజమానుల హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. భూ రికార్డుల్లో తప్పులు, సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని సరిచేసి బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేసింది.

సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. అవసరమైతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి కూడా వెనుకాడబోమని ప్రకటించారు. ప్రజల ఆస్తుల హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సెక్షన్‌ 22ఏ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని నాయకులు పేర్కొన్నారు.