సిగ్గు సిగ్గు.. దమ్ము, ధైర్యం లేదు..
- బీజేపీ దాడి పిరికిపంద చర్య : షర్మిల
- రాష్ట్ర అధ్యక్షుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
- పేపర్ లీకులపై ప్రధాని, కేంద్ర విద్యాశాఖ మంత్రిపై తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రభ, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయంపై బీజేపీ చేసిన దాడి పిరికిపంద చర్య అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. యువత భవిత కోసం కాంగ్రెస్ చేస్తున్న శాంతియుత ఆందోళనలకు సమాధానం చెప్పే దమ్ము లేక, సహనం కోల్పోయి భౌతిక దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి నీతి మాలిన చర్యలు అత్యంత హేయమైనవి అని షర్మిల పేర్కొన్నారు.
స్వయంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ దగ్గరుండి గూండాల్లా, రౌడీల్లా వ్యవహరిస్తూ కాంగ్రెస్ శ్రేణులపై దాడులకు ఉసిగొల్పడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆంధ్రరత్న భవన్ వద్ద బీజేపీ పాల్పడిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారాన్ని, పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని ఏది చేసినా చెల్లుతుందని అనుకుంటే తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఇదే సందర్భంగా ప్రశ్నపత్రాల లీకుల వ్యవహారంపై కూడా షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుంది పేపర్ లీకులపై మోదీజీ కామెంట్లు అని విమర్శించారు. రాజీనామాకు డిమాండ్ చేస్తూ దేశమంతా ఏకతాటిపై ఉద్యమం చేస్తుంటే, మోదీజీ నీతి సూత్రాలు చెప్పడం అత్యంత హాస్యాస్పదం అని అన్నారు.
పేపర్ లీకులపై మోదీ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉన్నాయి అని వ్యాఖ్యానించిన షర్మిల, అసలు లీకుల సూత్రధారి ప్రధాని నరేంద్ర మోదీ అయితే, పాత్రధారి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అని ఆరోపించారు. తీగ లాగితే ఎక్కడ డొంక కదులుతుందోనన్న భయం మోదీకి ఉందని అన్నారు.
నిజంగా ప్రశ్నపత్రాల లీకులను మహాపాపంగా పరిగణిస్తే, లీకుల బాధ్యులను కఠినంగా శిక్షించాలని చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీ నైతిక బాధ్యత వహించాలని, వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశంపై పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
