BJP |సీజేపీ పోరుపై సుధాంశు త్రివేది సెటైర్‌!

‘కాక్రోచ్‌ జనతా పార్టీ’పై బీజేపీ విమర్శలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నీట్‌ పేపర్‌ లీక్‌ ఆరోపణలు, విద్యార్థుల సమస్యలపై పోరాటంతో తెరపైకి వచ్చిన ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (సీజేపీ) తాజాగా ఎన్నికల అంశాలపై నిరసనలు చేపట్టడాన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తప్పుబట్టింది. విద్యార్థుల ఉద్యమం నుంచి రాజకీయ అంశాలపై పోరాటానికి పార్టీ అకస్మాత్తుగా మారిందంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుధాంశు త్రివేది విమర్శించారు. ఈ మార్పు రేడియోధార్మిక క్షీణతలోనూ కనిపించనంత వేగంగా జరిగిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీడియా ప్రశ్నలకు త్రివేది సమాధానమిచ్చారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే ఆ నిరసన ఎంతవరకు సమర్థనీయమన్నది వేరే అంశమని వ్యాఖ్యానించారు. రెండు నెలల క్రితం పరీక్షల విధానంపై విద్యార్థుల ఉద్యమంగా ఉన్న సీజేపీ.. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన అంశాలపై పోరాటం చేస్తోందని విమర్శించారు. సీజేపీ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) తరఫున పరోక్షంగా పోరాడుతోందని బీజేపీ సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ శనివారం ఆరోపించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

విద్యార్థుల మద్దతు తమకే ఉందన్న బీజేపీ

వివిధ విశ్వవిద్యాలయాల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, యువత అభిప్రాయాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయని త్రివేది అన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికలతో పాటు పంజాబ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లోనూ విజయం సాధించామని పేర్కొన్నారు.