డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం బీజేపీ నేతల బిక్షాటన

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్ ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి పట్టణంలో బిక్షాటన కార్యక్రమం చేపట్టారు.
పట్టణంలోని కాంటా చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు జోలె పట్టి తిరుగుతూ బిక్షాటన చేసి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై తీవ్రంగా విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో తహసీల్దార్ విడుదల చేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా జాబితా రూపొందించారని, గతంలో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కోసం రూ.3 లక్షలు తీసుకుంటామని చెప్పిన ఆడియో టేపు కూడా బెల్లంపల్లిలో వైరల్ అయిందని తెలిపారు.
ఇప్పుడు విడుదలైన జాబితాలో పేరు రావాలంటే ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తూ కోట్ల రూపాయల కుంభకోణం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ టౌన్ అధ్యక్షురాలు దార కళ్యాణి, జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్ కుమార్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గోమాస కమల, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కోడి సురేష్, పట్టణ కోశాధికారి సంతోష్ అగర్వాల్, సోషల్ మీడియా కన్వీనర్ తోటపల్లి ఓం సాయితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
