Bigg Boss 10 Telugu | బిగ్‌బాస్‌ ఇంట్లో నాగ్‌ ఫైర్.. రోహిత్‌కు ‘గెట్‌ అవుట్’.. ముగ్గురికి ఎల్లో కార్డులు!

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10లో 27వ రోజు ఎపిసోడ్‌ పూర్తిగా వార్నింగ్‌లతోనే నడిచింది. సాధారణంగా వీకెండ్‌ ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్లతో సరదాగా మాట్లాడటం, వారి ఆటతీరును సమీక్షించడం కనిపిస్తుంది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. ఇంట్లో జరిగిన కొన్ని ఘటనలను ఒక్కొక్కటిగా బయటకు తీసిన నాగార్జున.. కంటెస్టెంట్ల ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ముఖ్యంగా రోహిత్‌ వ్యవహారంపై నాగ్‌ తీవ్రంగా స్పందించారు. బిగ్‌బాస్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, చరణ్‌తో జరిగిన సంభాషణ, సృష్టితో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ రోహిత్‌కు గట్టి క్లాస్‌ ఇచ్చారు. ఒక దశలో ఇంటి తలుపులు తెరిపించి బయటకు వెళ్లిపోవాలని కూడా చెప్పడంతో హౌస్‌లో ఒక్కసారిగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. చివరికి రోహిత్‌ క్షమాపణలు చెప్పడంతో నాగ్‌ అతడికి ఎల్లో కార్డుతో ఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

డ్యాన్స్‌తో నాగ్‌ ఎంట్రీ.. మొదట్లో సరదాగా సాగిన ఎపిసోడ్‌

వీకెండ్‌ ఎపిసోడ్‌ను నాగార్జున తన డ్యాన్స్‌తో ప్రారంభించారు. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత శుక్రవారం జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఇంటి సభ్యుల మధ్య జరిగిన కొన్ని సరదా సంఘటనలను చూపించారు.
వర్షిణి మైక్‌ లేకుండా కెమెరా ముందు మాట్లాడటంతో బిగ్‌బాస్‌ ఆమెను మైక్‌ పెట్టుకోవాలని సూచించడం, ఆమె సైగలతో స్పందించడం వంటి సన్నివేశాలు నవ్వులు పూయించాయి.

అదే సమయంలో కెప్టెన్‌ గదిలో అపూర్వ బట్టలు ఉతకడం కూడా ఇంట్లో చిన్న వివాదానికి దారితీసింది. అత్యవసరంగా ఆ గదిని ఉపయోగించాల్సి ఉందని, ఇంతసేపు అక్కడే ఉండటం వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందని త్రిగుణ్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు.

స్టార్‌ హెల్త్‌ గేమ్‌.. తర్వాత కామెడీ స్కిట్‌

కంటెస్టెంట్లతో ప్రమోషనల్‌ గేమ్‌ నిర్వహించారు. అనంతరం ఇంటి సభ్యులు కలిసి ఓ సరదా స్కిట్‌ చేశారు., వంశీ, నరేశ్‌, సృష్టి కాలేజ్‌ సీనియర్లుగా కనిపించగా.. ముకేశ్‌, వర్షిణి, రోహిత్‌, షాలిని లవర్స్‌ పాత్రల్లో నటించారు. సీనియర్లు జూనియర్లను ఆటపట్టించే విధంగా సాగిన ఈ స్కిట్‌ హౌస్‌లో నవ్వులు తెప్పించింది.

ఆ తర్వాత డాజ్లర్‌ ప్రమోషన్‌లో భాగంగా ర్యాంప్‌ వాక్‌ కూడా నిర్వహించారు. కంటెస్టెంట్లు తమదైన స్టైల్‌లో ర్యాంప్‌పై నడిచి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ గేమ్‌లో నరేశ్‌, దేబ్జానీ, సృష్టి, త్రిగుణ్‌ విజేతలుగా నిలిచారు.

అసలు కథ మొదలైంది.. నాగ్‌ ఒక్కొక్కరినీ నిలబెట్టడంతో టెన్షన్‌

సరదా కార్యక్రమాలు ముగిసిన తర్వాత నాగార్జున అసలు విషయాల్లోకి వెళ్లారు. చరణ్‌ను ముందుగా సీక్రెట్‌గా పిలిచి రోహిత్‌తో అతనికి జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోను చూపించారు.వీడియోలో ఉన్న కొన్ని మాటలను చరణ్‌ బయట చెప్పడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. దీంతో నాగార్జున అసలు ఇంట్లో ఏం జరుగుతోందనే విషయాన్ని ఒక్కొక్కటిగా బయటకు తీసుకురావడం ప్రారంభించారు.తర్వాత రోహిత్‌, త్రిగుణ్‌, అమన్‌లను గార్డెన్‌ ఏరియాకు పంపించారు. ఈ ముగ్గురి వ్యవహారాలపై నాగార్జున మాట్లాడబోతున్నారని అర్థమై హౌస్‌లో ఆసక్తి పెరిగింది.

అపూర్వకు నాగ్‌ షాక్‌.. ‘డిజాస్టర్‌ కెప్టెన్‌’ అంటూ ఫైర్‌

కెప్టెన్‌గా ఉన్న అపూర్వను నాగార్జున మొదట ప్రశ్నించారు. కెప్టెన్‌గా తనకు గౌరవం ఇవ్వాలని ఆమె గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన నాగ్‌.. మరి ఆమె కెప్టెన్‌గా ఎంతవరకు బాధ్యతగా వ్యవహరించిందని ప్రశ్నించారు.కెప్టెన్సీ గదిలో కొన్ని వస్తువులను దాచడం ఎందుకు చేశావని నిలదీశారు. అంతేకాకుండా ఇంటి బయట జరిగిన విషయాలను, కామనర్స్‌ గురించి తెలుసుకున్న విషయాలను హౌస్‌లో చెప్పకూడదని తెలిసినా ఎందుకు ప్రస్తావించావని అడిగారు.


దీంతో అపూర్వ తన వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.అయితే నాగార్జున మాత్రం ఆమె వివరణతో సంతృప్తి చెందలేదు. కెప్టెన్‌గా వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమెను ‘డిజాస్టర్‌ కెప్టెన్‌’గా అభివర్ణించారు.ఈ వ్యాఖ్యతో అపూర్వ భావోద్వేగానికి గురైంది. అయితే నాగ్‌ మాత్రం తన మాటలను సీరియస్‌గా తీసుకుని ఇకపై కెప్టెన్‌గా మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

రాంప్రసాద్‌కు కూడా క్లాస్‌.. ఎందుకు ఇంత సేపు పడుకుంటున్నావ్‌?

ఆ తర్వాత రాంప్రసాద్‌ను నాగార్జున ప్రశ్నించారు. నామినేషన్ల గురించి మాట్లాడొద్దని బిగ్‌బాస్‌ స్పష్టంగా చెప్పినప్పటికీ ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించావని అడిగారు.అంతేకాదు.. ఇంట్లో ఎక్కువసేపు పడుకుంటున్న రాంప్రసాద్‌ వీడియోను కూడా చూపించారు.దీనిపై రాంప్రసాద్‌ తన పరిస్థితిని వివరించాడు. తనకు గతంలో యాక్సిడెంట్‌ కావడంతో మెడ, నడుము నొప్పి ఉంటుందని, అందుకే కొంత విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పాడు.అయితే తన బలహీనతను ఇతరులకు చెప్పుకోవడం తనకు ఇష్టం లేదని రాంప్రసాద్‌ చెప్పాడు.దానికి నాగార్జున స్పందిస్తూ.. అది బలహీనత కాదని, తన పరిస్థితి గురించి ఇంట్లో వాళ్లకు చెబితే వారు కూడా అర్థం చేసుకుని అవసరమైన సమయంలో సహాయం చేస్తారని సూచించారు.

షాలినికి నాగ్‌ వార్నింగ్‌.. మాటల విషయంలో జాగ్రత్త!

తర్వాత షాలిని వంతు వచ్చింది. షాలిని గతంలో ఉపయోగించిన ఒక అభ్యంతరకరమైన పదాన్ని నాగార్జున ప్రస్తావించారు.కెమెరాల ముందు మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నామో ఆలోచించుకోవాలని సూచించారు. ఎడిటింగ్‌లో ఆ మాట తొలగిపోతుందని భావించకూడదని స్పష్టం చేశారు.షాలిని వెంటనే తన తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పింది.అక్కడితో ఆపకుండా.. చిన్న విషయానికే పెద్దగా అరవడం, ఆవేశంగా స్పందించడం కూడా తగ్గించుకోవాలని నాగ్‌ సూచించారు. ఆటలో తన ప్రవర్తనను మార్చుకోవాలని స్పష్టంగా చెప్పారు.

అపూర్వ–షాలిని వివాదం.. నాగ్‌ ముందు అసలు విషయం బయటకు!

అపూర్వ, షాలిని మధ్య జరిగిన వివాదాన్ని కూడా నాగార్జున ప్రస్తావించారు.రోహిత్‌, షాలిని మాట్లాడుకుంటున్న సమయంలో అపూర్వ అక్కడికి వెళ్లడం.. ఆ తర్వాత పరిస్థితి మారడం.. దీనికి సంబంధించిన మొత్తం ఘటనను వీడియో రూపంలో చూపించారు.అపూర్వను ఉద్దేశించి నాగ్‌.. అసలు అక్కడికి ఎందుకు వెళ్లావని ప్రశ్నించారు.ఇతర ఇద్దరి మధ్య ఉన్న వ్యవహారంలోకి వెళ్లడం వల్లే సమస్య మరింత పెద్దదైందని సూచించారు. అంతేకాకుండా షాలినిని కూడా నాగార్జున ప్రశ్నించారు.రోహిత్‌తో మాట్లాడుతున్న సమయంలో అపూర్వను వెళ్లిపోమని చెప్పావు. ఆమె వెళ్లిపోయిన తర్వాత మళ్లీ ఎందుకు ఆ విషయాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడావని అడిగారు.చివరికి అపూర్వకు ఇదే చివరి హెచ్చరిక అని నాగ్‌ స్పష్టం చేశారు. ఇకపై ఎవరినైనా రెచ్చగొట్టడం లేదా ఒకరిని మరొకరిపైకి పంపించే ప్రయత్నం చేయొద్దని చెప్పారు.

అమన్‌కు ఎల్లో కార్డు.. ‘ఇక ఒక్క తప్పు చేసినా బయటకే’

అమన్‌ను లివింగ్‌ రూమ్‌లోకి పిలిచిన నాగార్జున.. ఈ వారం నీ ఆట ఎలా ఉందని అడిగారు.అమన్‌ తన గేమ్‌ గురించి వివరించాడు. అయితే నాగ్‌ అక్కడితో ఆగలేదు.గతంలో అమన్‌ మాట్లాడిన మాటలకు సంబంధించిన కొన్ని వీడియోలను చూపించారు. ముఖ్యంగా త్రిగుణ్‌తో జరిగిన వివాదంలో అమన్‌ మాటల తీరు ఎలా ఉందో గుర్తు చేశారు. కోపంలో ఉన్నప్పటికీ త్రిగుణ్‌ తనను తాను కొంతవరకు కంట్రోల్‌ చేసుకున్నాడని, కానీ అమన్‌ మాత్రం మాటల విషయంలో హద్దులు దాటాడని నాగార్జున అభిప్రాయపడ్డారు.దీంతో అమన్‌కు ఎల్లో కార్డు చూపించారు.
ఇకపై మరో తప్పు చేస్తే ఎలాంటి అవకాశం ఉండదని.. నేరుగా ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుందని నాగ్‌ స్పష్టం చేశారు. ఇది ఫైనల్‌ వార్నింగ్‌ అని తేల్చిచెప్పారు.

అదే సమయంలో ఝాన్సీ.. అమన్‌ను కంట్రోల్‌ చేయడానికి ప్రయత్నించిన తీరును నాగ్‌ ప్రశంసించారు. గేమ్‌లో ఆమె చూపిస్తున్న ఇంప్రూవ్‌మెంట్‌ను మెచ్చుకున్నారు.

ముకేశ్‌ కామెంట్స్‌.. నాగ్‌ వీడియో చూపించడంతో సీన్‌ మారిపోయింది

తర్వాత ముకేశ్‌ను నాగార్జున ప్రశ్నించారు. రోహిత్‌ గురించి కెప్టెన్సీకి సంబంధించిన సందర్భంలో ముకేశ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.ముకేశ్‌ మాత్రం తాను ఆ మాటను కెప్టెన్సీ కోణంలోనే అన్నానని, వ్యక్తిగతంగా రోహిత్‌ను ఉద్దేశించి కాదని వివరణ ఇచ్చాడు.అయితే నాగ్‌ అక్కడితో ఆపకుండా.. ముకేశ్‌ మాట్లాడిన అసలు వీడియోను చూపించారు.ఆ వీడియో చూసిన తర్వాత పరిస్థితి మరింత స్పష్టమైంది.దేబ్జానీని కూడా నాగార్జున ఈ విషయంపై అడిగారు. ఆమె స్పందిస్తూ.. ఆ మాటలు బయట నుంచి చూస్తే మరోలా అనిపించవచ్చని, కానీ ముకేశ్‌ వ్యక్తిత్వం అలాంటిది కాదని చెప్పింది.చివరికి ముకేశ్‌తో ఇంటి సభ్యులందరికీ క్షమాపణ చెప్పించారు.అయితే ఈ వారం ముకేశ్‌ ఆట మాత్రం బాగుందని నాగార్జున ప్రశంసించారు. గేమ్‌లో అతడి ఇంప్రూవ్‌మెంట్‌ను గుర్తించారు.

దేబ్జానీ, నరేశ్‌, వంశీలకు ప్రశంసలు

అందరినీ వరుసగా సమీక్షించిన నాగార్జున కొందరి ఆటతీరును ప్రత్యేకంగా ప్రశంసించారు.దేబ్జానీ ఆటలో మంచి ఎనర్జీ కనిపిస్తోందని చెప్పారు. ఆమెతో సరదాగా మాట్లాడటంతో పాటు గత టాస్క్‌లో జరిగిన కొన్ని విషయాలను కూడా ప్రస్తావించారు.నరేశ్‌, వంశీ ఆటతీరు కూడా బాగుందని చెప్పారు.సృష్టి, సుధీర్‌ ఆటలో మంచి మార్పు కనిపిస్తోందని నాగార్జున ప్రశంసించారు. ముఖ్యంగా సుధీర్‌ ఇమ్యునిటీ సాధించడం అతడి గేమ్‌లో కీలకమైన మలుపు అని పేర్కొన్నారు.అయితే చరణ్‌ విషయంలో మాత్రం నాగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంట్లో అతడి ఆట పెద్దగా కనిపించడం లేదని సూచించారు.

త్రిగుణ్‌కు కూడా ఎల్లో కార్డు.. నాగ్‌ సీరియస్‌

ఇక త్రిగుణ్‌ను పిలిచిన నాగార్జున.. రోహిత్‌తో జరిగిన గొడవ గురించి మాట్లాడారు.త్రిగుణ్‌ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. కోపంలో కొన్ని మాటలు వచ్చినప్పటికీ వాటిని ఆపుకున్నానని చెప్పాడు.కానీ నాగార్జున మాత్రం మరో కోణాన్ని చూపించారు.త్రిగుణ్‌ రోహిత్‌పైకి వెళ్లిన తీరు, కోపంలో చేసిన కొన్ని చర్యలకు సంబంధించిన వీడియోలను చూపించారు.అక్కడితో ఆగకుండా షాలినిని కూడా ప్రశ్నించారు. ఈ గొడవలో ఎవరి తప్పు ఎక్కువగా ఉందని అడిగితే.. ఇద్దరిలోనూ తప్పు ఉందని ఆమె చెప్పింది.ఇది త్రిగుణ్‌కు మరో షాక్‌గా మారింది.నాగార్జున మాట్లాడుతూ.. త్రిగుణ్‌ నుంచి ప్రేక్షకులు చాలా ఎక్కువ ఆశిస్తున్నారని, కానీ ఇలాంటి ప్రవర్తన అతడి ఇమేజ్‌కు నష్టం చేస్తుందని సూచించారు. కోపం వచ్చినా ఆటలో హద్దులు దాటకూడదని చెప్పారు.త్రిగుణ్‌కు కూడా ఎల్లో కార్డు చూపించారు. ఇకపై ఇలాంటి ప్రవర్తన రిపీట్‌ అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

రోహిత్‌ ఎపిసోడ్‌.. ఒక్కసారిగా ఇంట్లో హై టెన్షన్‌

అయితే ఎపిసోడ్‌లో అసలు హైలైట్‌ రోహిత్‌ వ్యవహారమే.నాగార్జున ఇంటి తలుపులు తెరిపించారు. బిగ్‌బాస్‌ షోను, బిగ్‌బాస్‌ను అవమానించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే తాను సహించబోనని స్పష్టం చేశారు.ఆ తర్వాత రోహిత్‌, చరణ్‌ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోను చూపించారు.ఆ వీడియోలో రోహిత్‌ బిగ్‌బాస్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నాగార్జున తీవ్రంగా స్పందించారు.‘బిగ్‌బాస్‌ నన్నేం పీ.. లేడు’ అనే ధోరణిలో మాట్లాడటం ఎందుకు అని ప్రశ్నించారు.హౌస్‌మేట్స్‌ అభిప్రాయం కూడా అడిగారు. అక్కడున్న సభ్యులంతా రోహిత్‌ తప్పు చేశాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘గెట్‌ అవుట్‌’.. రోహిత్‌కు నాగ్‌ భారీ షాక్‌

పరిస్థితి తీవ్రంగా మారడంతో నాగార్జున రోహిత్‌ను ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు.ఒక్కసారిగా షాక్‌కు గురైన రోహిత్‌ నాగార్జునకు క్షమాపణలు చెప్పాడు.బిగ్‌బాస్‌కు, ఆడియన్స్‌కు కూడా సారీ చెప్పాడు. ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడనని, తన ప్రవర్తనను మార్చుకుంటానని హామీ ఇచ్చాడు.అయితే నాగార్జున వెంటనే క్షమించలేదు.రోహిత్‌కు ఎల్లో కార్డు చూపించారు. ఇది ఫైనల్‌ వార్నింగ్‌ అని స్పష్టం చేశారు.అంటే ఇకపై ఇలాంటి తప్పు మరోసారి జరిగితే కఠిన నిర్ణయం తప్పదన్న సంకేతాన్ని ఇచ్చారు.

సృష్టి విషయంలోనూ రోహిత్‌కు మరో క్లాస్‌

ఇంతటితో రోహిత్‌ వ్యవహారం ముగియలేదు.సృష్టి తన చేతికి నొప్పిగా ఉందని చెప్పిన సందర్భంలో కూడా రోహిత్‌ స్పందించిన తీరు, డ్రమ్‌ను తన్నిన ఘటనకు సంబంధించిన వీడియోను నాగార్జున చూపించారు.ఇలాంటి సమయంలో ఎదుటి వ్యక్తికి నొప్పి ఉందని తెలిసిన తర్వాత కూడా ఆవేశంగా వ్యవహరించడం సరికాదని నాగ్‌ సూచించారు.ఆటలో గెలవాలనే కసి ఉండటం మంచిదే కానీ.. అది హద్దులు దాటితే సమస్యగా మారుతుందని స్పష్టం చేశారు.
రోహిత్‌ తన తప్పును అంగీకరించాడు.

‘ఇలాంటి రోజు మళ్లీ రాకూడదు’.. నాగ్‌ ఫైనల్‌ వార్నింగ్‌

ఒకే ఎపిసోడ్‌లో ముగ్గురు కంటెస్టెంట్లకు ఎల్లో కార్డులు రావడం ఈ ఎపిసోడ్‌లో ప్రత్యేకంగా నిలిచింది.అమన్‌, త్రిగుణ్‌, రోహిత్‌లకు నాగార్జున వార్నింగ్‌ ఇచ్చారు. మరోవైపు అపూర్వ, షాలిని, రాంప్రసాద్‌, ముకేశ్‌లను కూడా వారి వారి తప్పులపై ప్రశ్నించారు.మొత్తంగా ఈ వీకెండ్‌ ఎపిసోడ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటే కంటెస్టెంట్ల ప్రవర్తనపైనే ఎక్కువ చర్చ జరిగింది.నాగార్జున చివర్లో.. ఆటలో పోటీ ఉండాలి కానీ అది కోపం, ద్వేషం, వ్యక్తిగత దూషణల వరకు వెళ్లకూడదనే సందేశాన్ని ఇచ్చారు.