Bigg Boss 10 Telugu |అదరగొట్టిన రామ్ ప్రసాద్, నరేశ్.. షాలినీ, అపూర్వ మధ్య మళ్లీ అదే లొల్లి!
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ‘రోడ్ టు రీలోడ్’ టాస్క్ మరింత ఆసక్తికరంగా మారింది. జంటలుగా విడిపోయిన కంటెస్టెంట్లు పాయింట్ల కోసం పోటీపడుతుండగా.. మరోవైపు ఇంట్లో మాటలతో మొదలైన చిన్న చిన్న విషయాలు గొడవలకు దారితీశాయి. ముఖ్యంగా రోహిత్-అపూర్వ-షాలిని మధ్య జరిగిన పరిణామాలు ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచాయి.
జంటలకు కొత్త టాస్క్.. పాయింట్ల కోసం పోటీ
ఎపిసోడ్‌లో భాగంగా బిగ్‌బాస్ ఐదు జంటలకు ‘స్టెప్ రోల్ గోల్’ అనే గేమ్ ఇచ్చారు. వంశీ, దేబ్జానీ సంచాలకులుగా వ్యవహరించారు. టాస్క్‌లో ఎవరు ముందుగా పూర్తి చేస్తారనే దానిపై పాయింట్లు కేటాయించారు.కంటెస్టెంట్లు ఉత్సాహంగా గేమ్ ఆడగా.. అమన్ మొదటి స్థానంలో నిలిచాడు. రాంప్రసాద్ రెండో స్థానాన్ని దక్కించుకోగా.. ముకేశ్ మూడో స్థానంలో నిలిచాడు. షాలినికి నాలుగో స్థానం, అపూర్వకు ఐదో స్థానం లభించాయి. దీంతో ఆయా స్థానాలకు అనుగుణంగా పాయింట్లు జతయ్యాయి.
రోహిత్ మాటతో మొదలైన వివాదం
టాస్క్ జరుగుతున్న సమయంలో రోహిత్, షాలిని, రాంప్రసాద్, అమన్ కలిసి మాట్లాడుకుంటున్న సమయంలో అపూర్వ అక్కడికి వచ్చింది. ఆ సమయంలో తమకు కొంత ప్రైవసీ కావాలని రోహిత్ చెప్పడంతో అపూర్వ అక్కడి నుంచి వెళ్లిపోయింది.ఆ తర్వాత ఈ విషయాన్ని అపూర్వతో క్లియర్ చేసుకునేందుకు రోహిత్ ప్రయత్నించాడు. అయితే తనకు ఆ విషయం పెద్దగా గుర్తు లేదని అపూర్వ చెప్పింది. ఇదే సమయంలో షాలిని కూడా ఈ చర్చలోకి రావడంతో పరిస్థితి మరోసారి వేడెక్కింది.
రోహిత్ చెప్పిన విషయాన్ని తన దగ్గర ప్రస్తావించొద్దంటూ అపూర్వ అసహనం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. మరోవైపు త్రిగుణ్ అపూర్వను ఓదార్చినట్టే చేస్తూ షాలినితో కూడా ఈ విషయంపై చర్చించాడు. షాలినికి అమన్ మద్దతుగా మాట్లాడుతున్నాడని భావించిన రోహిత్.. అమన్‌ను కూడా అలా చేయొద్దని సూచించాడు.
అమన్-త్రిగుణ్ అదుర్స్..
తర్వాత కంటెస్టెంట్ల మధ్య సరదా వాతావరణం కనిపించింది. వర్షిణి, ముకేశ్ కలిసి నరేశ్‌ను స్విమ్మింగ్ పూల్‌లోకి తీసుకెళ్లడంతో ఇంట్లో నవ్వులు పూశాయి. అనంతరం కంటెస్టెంట్లు పూల్‌లోకి దిగి సందడి చేశారు.ఇదిలా ఉండగా లీడర్ బోర్డులో అమన్, త్రిగుణ్ జంట 180 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఈ జంట నామినేషన్స్ నుంచి సేఫ్ అయింది.
‘చిత్రం భలారే విచిత్రం’లో అసలు పరీక్ష
తర్వాత బిగ్‌బాస్ మరో ఆసక్తికరమైన టాస్క్‌ను ప్రవేశపెట్టారు. ‘చిత్రం భలారే విచిత్రం’ పేరుతో జరిగిన ఈ గేమ్‌లో మిగిలిన నాలుగు జంటలు పాల్గొన్నాయి.స్క్రీన్‌పై కొన్ని చిత్రాలను ఒక క్రమంలో చూపిస్తారు. సంచాలకులు చెప్పిన నంబర్ ఆధారంగా కంటెస్టెంట్లు వాటిని గుర్తించి బోర్డుపై గీయాలి. అనంతరం డార్క్ యార్డ్‌లోని సరైన వస్తువును గుర్తించి నిర్దేశించిన ప్రదేశంలో ఉంచాలి. సరిగ్గా పూర్తి చేసిన వారికి పాయింట్లు లభిస్తాయి.ఈ టాస్క్‌లో షాలిని, అపూర్వ, నరేశ్, ఝాన్సీ చిత్రాలను గీయగా.. రోహిత్, చరణ్, రాంప్రసాద్, ముకేశ్ వస్తువులను తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నారు.
ఝాన్సీపై షాలిని ఆరోపణలు
టాస్క్ మధ్యలో మరో వివాదం చోటుచేసుకుంది. ఝాన్సీ ముందుగానే ముకేశ్‌కు కొన్ని బొమ్మల పేర్లు చెప్పిందని షాలిని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో గేమ్‌లో చీటింగ్ జరిగిందంటూ వాదన మొదలైంది.మరో రౌండ్‌లో కొంతమంది కంటెస్టెంట్లను ఆపి రాంప్రసాద్‌కు మాత్రమే అవకాశం ఇవ్వడంతో రోహిత్, షాలిని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో టాస్క్ కాస్త గందరగోళంగా మారింది.
రాంప్రసాద్-నరేశ్ జంట దూకుడు..
గేమ్ చివరి దశకు చేరుకునే కొద్దీ పాయింట్ల కోసం పోటీ మరింత పెరిగింది. ముకేశ్ ఒక సమాధానం సరిగ్గా చెప్పగా.. రోహిత్, చరణ్ చెరో రెండు సరైన సమాధానాలు ఇచ్చారు. రాంప్రసాద్ మాత్రం ఐదు బొమ్మలను కరెక్ట్‌గా గుర్తించి తన జట్టుకు కీలక పాయింట్లు సాధించాడు.చివరికి రాంప్రసాద్, నరేశ్ జంట మొత్తం 220 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అపూర్వ-చరణ్ జంట 200 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. ముకేశ్-ఝాన్సీ జంట 160, రోహిత్-షాలిని జంట 140 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఇలా టాస్కులు, గొడవలు, నవ్వులు, వ్యూహాలతో అక్టోబర్ 8 నాటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ముగిసింది. రాబోయే టాస్కుల్లో ఎవరు పాయింట్లను పెంచుకుంటారు? నామినేషన్స్ నుంచి మరెవరు సేఫ్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
