Kavitha | అధికారంలోకి వస్తే భూ లక్ష్మి పథకం…

భూమిలేని పేదలకు ఎకరం.. కవిత కీలక ప్రకటన


Kavitha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని భూమిలేని పేదలకు ఎకరం చొప్పున భూమి ఇచ్చేలా ‘భూ లక్ష్మి పథకం’ అమలు చేస్తామని ఆ పార్టీ అధినేత్రి కవిత ప్రకటించారు. బంజారాహిల్స్‌ లోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్రంలో భూమి పంపిణీ అవసరం ఉందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భూమి కేవలం లావాదేవీల అంశంగా కనిపించవచ్చని, అయితే పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు భూమి, అడవి జీవనాధారమని కవిత వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా ముందుగా అసైన్డ్‌ భూములనే తీసుకుంటున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో సుమారు 30 వేల ఎకరాల అసైన్డ్‌ భూములను ప్రభుత్వం తీసుకుందని కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు అసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

రేవంత్‌రెడ్డి సోదరులపై కూడా కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. వారి ఆధ్వర్యంలో భూ దోపిడీ జరుగుతోందని ఆరోపిస్తూ.. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలనను తీవ్రంగా విమర్శించారు. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క కుటుంబ సభ్యుల ప్రభావం ప్రభుత్వంలో కొనసాగుతోందని ఆమె ఆరోపించారు.

ప్రొఫెసర్‌ జయంతి సందర్భంగా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి.. గత 31 నెలల్లో ఆ అంశాన్ని ఎందుకు పట్టించుకోలేదని కవిత ప్రశ్నించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే ముందు కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు.

ప్రభుత్వ సలహాదారుల నియామకాల్లోనూ బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఒకే రోజు శివధర్‌రెడ్డి, వీహెచ్‌లను సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, అయితే ఇద్దరి వేతనాల్లో తేడా ఎందుకు ఉందని ప్రశ్నించారు.

ఆర్టీఐ కమిషన్‌లో ఒక్క బీసీకి కూడా అవకాశం కల్పించలేదని కవిత ఆరోపించారు. ప్రభుత్వ నియామకాల్లో సామాజిక న్యాయం పాటించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో అగ్రవర్ణాలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం కొనసాగుతోందని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కవిత సూచించారు. అయితే ఆమె చేసిన భూ కేటాయింపులు, ప్రభుత్వ నియామకాలు, అసైన్డ్‌ భూములపై ఆరోపణలపై అధికారిక వివరణలు వెలువడాల్సి ఉంది.