ఉత్తరాంధ్ర చరిత్రకు సాక్ష్యంగా భోగాపురం విమానాశ్రయం

  • కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

భోగాపురం, ఆంధ్రప్రభ: ఉత్తరాంధ్ర చరిత్రకు సాక్ష్యంగా భోగాపురం విమానాశ్రయం అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి పౌర విమానయాన సేవలు సోమవారం నుండి ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి అధికారిక కార్యక్రమాలను ప్రారంభించారు. విమానయాన సంస్థ ప్రతినిధులతో కలసి కేక్ ను కట్ చేశారు. ప్రయాణీకులకు బోర్డింగ్ పాస్ లను, టికెట్ లను అందజేశారు.

అంతకుముందు హైదరాబాద్ నుండి విచ్చేసిన ఇండిగో విమానానికి విమానాశ్రయ సిబ్బంది వాటర్ కానన్ లతో స్వాగత సెల్యూట్ ను పలికారు. దేశ, విదేశాలకు ప్రయాణాలు చేసేవారితో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. విమానాశ్రయ అందాలు చూస్తూ మురిసిపోయిన ప్రయాణీకులు మొబైల్ లో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా ప్రయాణీకులతో రామ్మోహన్ నాయుడు ముచ్చటించారు. విమానాశ్రయంలో అందుతున్న వసతులు, ఎదురైన అనుభూతుల గురించి ఆరా తీశారు. విమానాశ్రయం గొప్పగా నిర్మించారంటూ ప్రయాణీకులు కితాబిచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. ప్రయాణీకులతో తాను మాట్లాడినప్పుడు వారి ఉత్సాహం చూస్తుంటే గర్వంగా అనిపించిందని అన్నారు. భోగాపురం విమానాశ్రయం ఓ భవన సముదాయంలా నిర్మించలేదని.. ఉత్తరాంధ్ర చరిత్రకు సాక్ష్యంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంత ఆశలకు జీవం పోస్తూ.. తమ భూములను త్యాగం చేసిన స్థానిక రైతులకు ఈ సంధర్భంగా రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఇంతగొప్పగా విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేసిన జిఎంఆర్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయని తెలిపిన రామ్మోహన్ నాయుడు.. విశాఖపట్నం విమానాశ్రయంతో తనకు కూడా ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ప్రైవేట్ విమానాల రాకపోకలకు ఆ విమానాశ్రయాని వినియోగించడంతో పాటు.. భవిష్యత్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశంలో మరింత స్థాయిలో అభివృద్ధి విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

భోగాపురం కనెక్టివిటీ విస్తరణకు మరిన్ని ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నం నుండి జాతీయ రహదారికి అనుసంధానం అయ్యే 7 రహదారులను విస్తరణ చేస్తున్నామని.. వీటితో పాటు సముద్ర తీరాన్ని అనుకుని రహదారి నిర్మాణం కోసం సైతం ప్రణాళిక సిద్దం అయిందని స్పష్టం చేశారు. పెట్టుబడులకు ప్రాణం పోసే విధంగా కొత్త అధ్యాయం ఈరోజు భోగాపురం విమానాశ్రయం ద్వారా ప్రారంభం అయిందని.. ప్రజలందరూ ఈ సేవలు వినియోగించుకోవాలని రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, విజయనగరం జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, జిఎంఆర్ అధికారులు ఐ.ప్రభాకర రావు, రామరాజు, తదితరులు పాల్గొన్నారు