తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

లోతట్టు ప్రాంతాలు, డ్రైనేజీ వ్యవస్థపై కలెక్టర్‌ నాగరాణి పరిశీలన

భీమవరం, ఆంధ్రప్రభ : తుఫాన్‌ నేపథ్యంలో కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు కలగకుండా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి సూచించారు. భీమవరం పట్టణంలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థను గురువారం ఆమె విస్తృతంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

తొలుత రజకపేటలోని రహదారులు, డ్రైనేజీలను కలెక్టర్‌ పరిశీలించారు. ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనుల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ పట్టణంలో జనజీవనానికి ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగుతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన రహదారులు, కాలువలను పరిశీలించారు. రైల్వేస్టేషన్‌ రోడ్డును ఆనుకుని ఉన్న డ్రైనేజీలో నీటి ప్రవాహ పరిస్థితిపై మున్సిపల్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

డి.ఎన్‌.ఆర్‌. కళాశాల రోడ్డులో నూతనంగా నిర్మించిన కల్వర్టులను పరిశీలించిన కలెక్టర్‌.. నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మెంటేవారితోటలోని మిరిమియాకోడు లాకుల వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి, కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. నరసయ్య అగ్రహారంలోని బీసీ సంక్షేమ వసతిగృహాన్ని తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న ఆహారం, విద్యా సౌకర్యాలు, వసతి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

చినరంగనిపాలెంలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను పరిశీలించిన కలెక్టర్‌.. పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పారిశ్రామిక ప్రాంత ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు నూతనంగా నిర్మించిన డ్రైనేజీ, కల్వర్టులను పరిశీలించారు. అక్కడ పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. పట్టణంలో ఎక్కడా మురుగునీరు, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

వర్షాల నేపథ్యంలో తాగునీరు కలుషితం కాకుండా ప్రజలకు సురక్షితమైన తాగునీటిని నిరంతరం సరఫరా చేయాలని కలెక్టర్‌ తెలిపారు. పారిశుద్ధ్య, మున్సిపల్‌, సాగునీటి శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు నిరంతర సేవలు అందించాలని ఆదేశించారు. పర్యటనలో సహాయ మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబు, మున్సిపల్‌ ఇంజనీర్‌ తాతాబాబు, వైద్య ఆరోగ్య అధికారి డా. రాజేష్‌, సహాయ ఇంజనీర్లు, పారిశుద్ధ్య తనిఖీ అధికారులు, పోలీస్‌, ట్రాఫిక్‌ సిబ్బంది పాల్గొన్నారు.