Bheemgal | పారదర్శకంగా పాలిస్తా..
Bheemgal, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండల్ బడా భీమ్‌గల్ సర్పంచ్ అభ్యర్థి మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుకే వేసి గెలిపించాలని కోరుతూ గడప గడప తిరుగుతూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. బడా భీమ్‌గల్ గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా రాచకొండ విష్ణువర్దిని శంకర్ గౌడ్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ.. విష్ణువర్దిని శంకర్ గౌడ్ మీ ఆదరణ, అండదండలు, అన్నింటికీ మించి మీ ఆశీస్సులు మాకు కావాలని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను. మీ విలువైన ఓటు వేసి నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని మరింతగా అభివృద్ది చేస్తాను. గ్రామ ప్రజల సమస్యలు, ప్రజా అవసరాల గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి నేను సర్పంచ్ గా గెలిస్తే గ్రామ ప్రజలకు అత్యవసర సమయంలో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసును అందిస్తూ, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేందుకు మా సొంత నిధులతో అంబులెన్సు, గ్రామంలో యువకులకు జిమ్ అందుబాటులోకి తీసుకువస్తాను.
అర్ధంతరంగా ఆగిపోయిన మెడికల్ భవనాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేయిస్తాను. గ్రామ ప్రజలకు నిరంతర ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రొఫెషనల్ డాక్టర్ ను అందుబాటులోకి తేవడంతో పాటు గ్రామంలో పశువులకు వైద్య సేవలు అందించేందుకు పశువుల ఆస్పత్రికు, సంబంధిత డాక్టర్ ను అందుబాటులోకి తెస్తాను. గ్రామంలో శుచి-శుభ్రతకు పెద్దపీట వేస్తూ, ఏడాదికి రెండుసార్లు గ్రామ ప్రజలందరికీ అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపి మందులు అందించే విధంగా ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి పరుస్తానని మాటిస్తున్నాను. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తాను. పాఠశాల అభివృద్ధితో పాటు, గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు పెదంగంటి ఎల్లమ్మ తల్లి ఆలయం అభివృద్ధికి కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తానని హామీ ఇస్తున్నాను.
గ్రామాభివృద్ధిలో యువతను, మహిళలను, గ్రామ పెద్దలను అందరినీ భాగస్వామ్యం చేస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తాను. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం కలిగించే విధంగా గ్రామంలో ప్రతి వీధిలో డ్రైనేజీ నిర్మాణం పనులు చేయిస్తాను. ఎక్కడా మురుగు నీరు ఆగకుండా ఉండేలా డ్రైనేజీల నిర్మాణం చేయిస్తాను. గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం… గ్రామంలో అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాల ఏర్పాటు కోసం కృషి చేస్తాను. గ్రామంలోని రెండు స్మశాన వాటికలను అభివృద్ధి చేసి, వాటిలో స్నానాల కోసం నీటి సౌకర్యంతో పాటు లైటింగ్ వ్యవస్థను ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయిస్తాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులు, గ్రామ పంచాయతీకి టాక్స్ ల రూపేణా వచ్చే నిధుల వివరాలతో పాటు, జమా, ఖర్చుల వివరాలను అణా పైసాతో సహా ప్రజలకు తెలిసే విధంగా పారదర్శకంగా గ్రామ పాలన సాగిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా అన్నారు.
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ యువత, విద్యార్థుల కోసం గ్రంథాలయం ఏర్పాటు చేయిస్తాను. గ్రంథాలయంలో కంప్యూటర్ ల్యాబ్ తో పాటు వైఫై సౌకర్యం కూడా కల్పిస్తాను. ఆ గ్రామంలోని వృద్ధులు, మహిళలు, వికలాంగులకు ప్రతి నెలా పెన్షన్లు తీసుకునేందుకు ఇబ్బందులు కలగకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా అనుకూలంగా ఉండే స్థలంలోకి పోస్ట్ ఆఫీస్ ను మార్పిస్తాను. పోస్టు ఆఫీసు వద్ద తాగడానికి మినరల్ వాటర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయిస్తాను. ఉత్తమ పౌర సమాజ నిర్మాణానికై పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయిస్తాను.
ఉన్నత చదువుల పై, యువతకు రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం వంటి అంశాలలో ఉన్నత విద్యావంతులు, ఉన్నతాధికారులచే అవగాహన కల్పిస్తూ, వారికి దిశా నిర్దేశం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తాను. చివరగా ఒక్కమాట స్పష్టం చేయదలిచాను… నేను సర్పంచ్ గా గెలిచాక నేను ఎక్కడికీ వెళ్లను. గ్రామ సేవకురాలుగా ఊర్లోనే ఉంటాను. నా ఊరి ప్రజల కోసం శ్రమిస్తాను. ప్రజల సమస్యలను వినేందుకు, వాటిని పరిష్కరించేందుకు నిరంతరం గ్రామంలోనే అందుబాటులో ఉంటాను. ఇది నేను నమ్మే దైవం మీద ఒట్టేసి చెపుతున్నా.. నేను మీ దానను.. మీ ఊరి బిడ్డనే..నన్ను గెలిపించండి… గ్రామాభివృద్ధిని నా పై వదిలేయండి.. పూర్తి సహకారాన్ని అందించడమే నా లక్ష్యం. ఈ ప్రచార కార్యక్రమంలో అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.

