Bheemgal దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి
Bheemgal దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి
- జాతీయ విచారణ కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం
- ఢిల్లీ సమావేశంలో పాల్గొన్న మాణిక్యాల శ్రీనివాస్
భీమ్‌గల్ రూరల్ (Bheemgal), ఆంధ్రప్రభ:
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో మంగళవారం ఢిల్లీలో జాతీయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ కె.జి. బాలకృష్ణన్‌ను బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం కలిసింది. ఈ సమావేశంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బాబానగర్ గ్రామానికి చెందిన మాణిక్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను బీఆర్ఎస్ ప్రతినిధులు కమిషన్ చైర్మన్‌కు సమర్పించారు. ఈ బృందంలో రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాణిక్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ, దళిత క్రైస్తవుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ నివేదిక సమర్పించడం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ఇదే అంశంపై ఇతర రాజకీయ పార్టీలు మౌనం పాటించడం బాధాకరమని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం క్రైస్తవుల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టిన ఘనత టీఆర్‌ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) పార్టీకే దక్కుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ నాయకులు బిషప్ విద్యాసాగర్, మోజెస్, సొలోమోన్, బిషప్ దుర్గం ప్రభాకర్, రమేష్ జాన్ తదితరులు పాల్గొన్నారు.
