ఖర్గేపై ‘శుద్ధీకరణ’ చర్యను ఖండించిన భట్టి విక్రమార్క

  • రాజ్యాంగ విలువలకు విరుద్ధమైన చర్యలను సహించబోమని స్పష్టం..
  • సెప్టెంబర్‌ 8న రాష్ట్రపతిని కలవాలని నిర్ణయం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌: కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పర్యటన అనంతరం చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న ‘శుద్ధీకరణ’ ఘటనపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై ఢిల్లీలో ఎస్సీ, ఎస్టీ పార్లమెంట్‌ సభ్యులతో కలిసి ఆయన సమావేశమై చర్చించారు.

ఖర్గేను అవమానించేలా జరిగినట్లు చెబుతున్న ఈ చర్యను భట్టి విక్రమార్కతో పాటు ఎస్సీ, ఎస్టీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ఇది ఒక ప్రజాప్రతినిధికి జరిగిన అవమానమే కాకుండా.. ఎస్సీ, ఎస్టీ వర్గాల గౌరవం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఘటనగా వారు అభివర్ణించారు.సమాజంలో సమానత్వం, గౌరవం, అంటరానితనం నిర్మూలన వంటి రాజ్యాంగ స్ఫూర్తికి ఇలాంటి ఘటనలు విరుద్ధమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ఘటనకు సంబంధించి బాధ్యులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క, ఎస్సీ–ఎస్టీ ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.ఈ అంశంపై తదుపరి కార్యాచరణను రూపొందించేందుకు సెప్టెంబర్‌ 7న ఇందిరా భవన్‌లో ఎస్సీ, ఎస్టీ ఎంపీల సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఘటనపై అనుసరించాల్సిన పోరాట కార్యాచరణపై ఆ సమావేశంలో చర్చించనున్నారు.

8న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్న నేతలు..

అనంతరం సెప్టెంబర్‌ 8న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఘటనపై జోక్యం చేసుకోవాలని కోరాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంపై న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. సమానత్వం, గౌరవం, హక్కుల పరిరక్షణ విషయంలో రాజ్యాంగం చూపిన మార్గంలోనే ముందుకు సాగుతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధ పద్ధతుల్లో ఈ అంశంపై పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.