భద్రాచలం, ఆంధ్రప్రభ : శ్రీ రామ నవమి సందర్భంగా భద్రాచలం భక్త జన సందోహంతో నిండిపోయింది… పూర్తిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది… వేద పండితులు, పూజారులు ఉత్సవ మూర్తులను వేదిక వద్దకు తీసుకు వస్తున్నారు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మిథిలా కళ్యాణ మండపం చేరుకోనున్నారు..ప్రభుత్వం తరుపున పట్టు వస్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు… ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగు కార్యక్రమాలో ఆయన పాల్గొంటారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమాక్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డి.శ్రీధర్ బాబు, కొండా సురేఖ తదితరులు హాజరు కానున్నారని తెలిసింది

శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి ఎంతో విశిష్టత ఉంది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో కల్యాణం, పట్టాభిషేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశ, విదేశాల నుంచి సుమారు 50 వేల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా
ఆలయ విశిష్ఠత
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలోకి సంబంధించి అనేక విశిష్టతలు ఉన్నాయి. గోదావరి నది తీరాన శ్రీసీతారామ చంద్ర స్వామి ఆలయాన్ని తొలుత వెలుగులోకి తెచ్చింది పోకల దమ్మక్క అనే ఆదివాసీ మహిళ. అనంతరం భక్త రామదాసుగా పిలవబడే కంచర్ల గోపన్న నిజాం నవాబుల సుంకం పైసలతో దీన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. దీనిపై అనేక పుస్తకాలు, సినిమాలు కూడా రూపొందాయి. స్వయంగా రాములవారే తన సోదరుడు లక్ష్మణ స్వామితో కలిసి తానీషా వద్దకు వెళ్ళి రామదాసును చెర నుంచి విడిపించారని చరిత్ర ఉంది.
భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో కుడి చేతిలో బాణం, ఎడమ చేతిలో విల్లు దర్శనమిస్తాయి. అలాగే మహావిష్ణువు మాదిరిగా కుడిచేతిలో శంకు, ఎడమచేతిలో చక్రంను ధరించి ఉంటారు. భద్రుని కోరిక మేరకు వైకుంఠం నుంచి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో దర్శనమివ్వటం వల్ల వైకుంఠ రామునిగా ఈ క్షేత్రంలో ప్రసిద్ధిగాంచారు. దేవాలయంలో స్వామి ఎడమ తొడపై ఆసీనవతియై ఇరువురు ఒకే పీఠంపై ఉంటారు. లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉండటం ఇక్కడి ప్రత్యేకత.
ఆలయ పునర్నిర్మాణం
1960 నాటికి ఇక్కడి సీతారామాలయం జీర్ణావస్థకు చేరుకుంది. నాటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళి జోక్యం చేసుకుని రామాలయ పునఃనిర్మాణానికి నడుం కట్టారు. రాష్ట్రం నలుమూలల విరాళాలు సేకరించారు. తమిళనాడుకు చెందిన గణపతి స్తపతి, 500 శిల్పుల సహకారంతో మూడు లక్షల ఖర్చుతో సకల కళాశోభితమైన కల్యాణ మండపం నిర్మించారు. రంగనాయకుల గుట్టపై రామదాసు ధ్యానమందిరం, శిల్పశోభాయమానమైన గోపురాలు కట్టారు. ప్రధాన ఆలయాన్ని పూర్తిగా నల్లరాతితో సౌందర్య శిల్పాలతో నిర్మించారు. 32 టన్నుల ఏకశిలతో ఆలయ విమాన గోపురం ఏర్పాటు చేశారు. ఈ విమాన గోపురం మూడు అంతస్తులు కలిగి అన్ని దేవతామూర్తుల శిల్పాలతో శోభాయమానమైంది.
భద్రాచలానికి రావాలంటే..?
భద్రాచలంలో ఆదివారం జరిగే సీతారాముల కల్యాణం చూడటానికి వచ్చే భక్తులు విజయవాడ, హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు మార్గంలో చేరేందుకు రవాణా సౌకర్యం చక్కగా ఉంది. రైలు మార్గంలో వచ్చేవారు కొత్తగూడెంలో దిగి రోడ్డు మార్గం ద్వారా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం చేరుకోవచ్చు.
భారీ బందోబస్తు
సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తారు. నిరంతరం పోలీసు అధికారులు పర్యవేక్షిస్తారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.