ఇంటర్నెట్ యుగంలో పిల్లల వినోదానికి కొత్త రూపం తెచ్చిన వెబ్ సిరీస్‌లు, చాలాసార్లు వారి ఆలోచనలపై లోతైన ప్రభావం చూపుతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకున్న ఒక విషాదం దీనికి ఉదాహరణ.

చదువులో ప్రతిభావంతుడైన 14 ఏళ్ల గాంధార్, ఇటీవల ఓటీటీలో ప్రసారమవుతున్న జపనీస్ వెబ్ సిరీస్ *“డెత్ నోట్”*‌పై మక్కువ పెంచుకున్నాడు. ఆ సిరీస్‌లో కథానాయకుడు ఒక‌ మాయా పుస్తకంలో ఎవరి పేరు రాస్తే వారు మరణించేలా చూపిస్తారు. చెడ్డవాళ్లను అంతం చేసే ఈ కల్పిత కథ, గాంధార్ మనసులో గాఢమైన ముద్ర వేసింది. ఆ ప్రభావం ఎంత లోతుగా చొచ్చుకెళ్లిందో తల్లిదండ్రులు కూడా ఊహించలేదు.

ఆ బాలుడు త‌న గ‌దిలో ఓ లెట‌ర్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు వెబ్ సిరీస్ ప్రభావమే కారణమని తల్లిదండ్రులు తెలిపారు. ఓటీటీలో ప్రసారమయ్యే జపనీస్ వెబ్ సిరీస్‌ను బాలుడు తరచూ చూస్తుండేవాడని, అందులోని పాత్రల ప్రభావంతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తులో కూడా గాంధార్‌కు ఎటువంటి వ్యక్తిగత సమస్యలు లేవని, సిరీస్‌లోని కథానాయకుడి ఆలోచనలే అతని మనసును ఆక్రమించాయని నిర్ధారించారు.

సూసైడ్ నోట్‌లో గాంధార్ ఇలా రాశాడు: “నేను చనిపోయానని ఎవరూ బాధపడకండి. పద్నాలుగేళ్లు మీతో సంతోషంగా గడిపాను. ఇక నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఈ ఇంటిని సంతోషాల నిలయంగా మార్చేందుకే ఈ పని చేస్తున్నాను. మీరు ఈ లేఖ చదివే సమయానికి నేను స్వర్గంలో ఉంటాను. తెలిసీ తెలియక చేసిన తప్పులకు క్షమించండి.”

ఈ ఘటనతో డిజిటల్ కంటెంట్ పిల్లల ఆలోచనలపై ఎంత లోతైన ప్రభావం చూపగలదు… అలాగే పెద్దలు దానిపై ఎంత జాగ్రత్తగా పర్యవేక్షించాలి..? అనే ప్ర‌శ్న‌లు రేకెత్తిస్తోంది. ఒక కల్పిత కథను నిజజీవితంలోకి అనుమతిస్తే, దాని ముగింపు ఎంత విషాదకరంగా మారవచ్చో గాంధార్ కథ మన కళ్లకు స్పష్టంగా చూపించింది.

Leave a Reply