పీఎం సూర్యఘర్ పథకంతో ప్రయోజనం
ఎలక్ట్రిసిటీ ఎస్ఈ దర్శన్ కుమార్
మహబూబాబాద్ టౌన్, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ ద్వారా ప్రతి ఒక్కరూ స్వయం సమృద్ధి సాధించి, ఉచిత విద్యుత్తును పొందవచ్చని ఎలక్ట్రిసిటీ ఎస్ఈ దర్శన్ కుమార్ తెలిపారు.
శనివారం జిల్లా కేంద్రంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్, వివిధ బ్యాంకులు, శివశక్తి ఇన్ఫ్రా-సోలార్ సొల్యూషన్స్ సంయుక్త సౌజన్యంతో ఏర్పాటు చేసిన సేవా-సేతు అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్లొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. గృహ వినియోగదారులు తమ ఇంటి పైకప్పు (రూఫ్‌టాప్) పై సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రతి నెలా 360 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని వివరించారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ. 78,000 రాయితీ అందిస్తుందని, మిగిలిన మొత్తానికి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ప్రసిద్ధ కంపెనీల సోలార్ ప్యానెల్స్‌నే వినియోగదారులకు అమర్చనున్నట్లు ప్రతినిధులు వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి రమేష్, తహసీల్దార్ రాజేశ్వర్, ఎలక్ట్రిసిటీ డీఈటీ. వీరాలాల్, ఏడిఈ సంగీత, ఏఈ శ్రీధర్ రెడ్డి, పలువురు వార్డు కౌన్సిలర్లు, ఎస్‌బీఐ, కెనరా, యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
