సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి!
‘మీ డబ్బు.. మీ క్లిక్.. మీ నిర్ణయం’ నినాదంతో అవగాహన కార్యక్రమాలు
ఆన్‌లైన్ చెల్లింపుల్లో జాగ్రత్తలు పాటించాలి..
సైబర్ మోసమైతే 1930కు ఫిర్యాదు చేయాలి : ఎస్పీ మహేష్ బి. గితే
రాజన్నసిరిసిల్ల, ఆంధ్రప్రభ: సైబర్ ఆర్థిక మోసాల నివారణ, సురక్షిత డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నవంబర్ నెలంతా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ‘మీ డబ్బు.. మీ క్లిక్.. మీ నిర్ణయం’ నినాదంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించే ముందు లబ్ధిదారుల వివరాలను ధ్రువీకరించుకోవాలని సూచించారు. నకిలీ పెట్టుబడి పథకాలు, ఆన్‌లైన్ ప్రకటనలు, నకిలీ కస్టమర్ కేర్ నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరిచితులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు. ఇతరుల సూచనలతో స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకూడదన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సైబర్ ఆర్ఎస్‌ఐ జునైద్, సైబర్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
