పెద్దపల్లి బీఆర్ఎస్లో బీసీల కొట్లాట
తన్నుకున్న గులాబీ శ్రేణులు
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సదస్సులో గులాబీ నాయకులు తన్నుకున్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సదస్సుకు నియోజకవర్గానికి చెందిన బీసీ నాయకులు గంట రాములు యాదవ్, దాసరి ఊష లతో పాటు ఇతర నాయకులను ఆహ్వానించలేదని ఆగ్రహించిన బీసీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

దాసరి మనోహర్ రెడ్డి వర్గానికి చెందిన కొంతమంది నాయకులు వారితో వాగ్వాదానికి దిగి తన్నుకున్నారు. కుర్చీలను విసిరేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను శాంతింప చేసి పంపించారు. దాసరి మనోహర్ రెడ్డి ఒంటెద్దు పోకడల వల్ల నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా లేకుండా పోయే పరిస్థితి వచ్చిందని పలువురు ఆరోపించారు. ఓడిపోయినా కూడా బీసీల అభిమానాన్ని మాజీ ఎమ్మెల్యే పూర్తిగా దెబ్బతీస్తున్నాడని ఇలా చేస్తూ పోతే పార్టీ పూర్తిగా పెద్దపల్లి లో లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ వాదం వినిపిస్తుంటే పెద్దపల్లిలో మాత్రం బీసీలను అవమానిస్తున్నారని ఆరోపించారు.
