BCCI | నాలుగేళ్ల తర్వాత టీమిండియాలో భువీ !

  • న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక..
  • భారత జట్టులోకి సీనియర్‌ పేసర్‌ పునరాగమనం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : టీమిండియా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మళ్లీ భారత జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన 16 మంది సభ్యుల జట్టులో భువీకి చోటు దక్కింది. దీంతో సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి భారత జెర్సీలో కనిపించనున్నాడు.

కివీస్ తో జ‌ర‌గ‌నున్న టీ20 సిరీస్ కు శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా, తిలక్‌ వర్మ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. జట్టులో అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ, సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబే, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, నమన్‌ ధీర్‌, ప్రిన్స్‌ యాదవ్‌, మయాంక్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌ ఉన్నారు. యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులకు సెలెక్టర్లు సమతూకం కల్పించారు.

భువనేశ్వర్‌ కుమార్‌ చివరిసారిగా 2022లో భారత టీ20 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత జాతీయ జట్టుకు దూరమైనా దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌లో తన ప్రదర్శన కొనసాగించాడు. ఆర్‌సీబీ తరఫున కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. దీంతో భువీ మళ్లీ టీమిండియాలోకి వస్తాడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు సెలెక్టర్ల నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత స్వింగ్‌ కింగ్‌ మళ్లీ భారత బ్లూలో కనిపించనున్నాడు. ఒకప్పుడు కొత్త బంతితో తన స్వింగ్‌తో ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన భువీ.. ఇప్పుడు మరోసారి అదే జెర్సీలో అంతర్జాతీయ క్రికెట్‌లో తన ముద్ర వేయాలని చూస్తున్నాడు. అతడి పునరాగమనంపై అభిమానుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది.

కాగా, న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందే భువనేశ్వర్‌ మరోసారి భారత బ్లూ జెర్సీలో కనిపించనున్నాడు. ఈ నెల 31 నుంచి నవంబర్‌ 1 వరకు జరగనున్న హాంకాంగ్‌ సిక్సెస్‌లో భారత జట్టుకు అతడు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అనంతరం న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.