బీసీ హక్కుల కోసం అక్టోబర్ 8న గర్జన
కొండపర్వ నుంచి నెమలి వరకు బైక్ ర్యాలీ
తిరువూరు, ఆంధ్రప్రభ : బీసీల హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం అక్టోబర్ 8న కొండపర్వ నుంచి నెమలి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీసీల సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై మాట్లాడారు. బీసీ గర్జన బైక్ ర్యాలీలో బీసీ నాయకులు, యువత, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీసీలకు రాజకీయ గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించగా, అనంతరం చంద్రబాబు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచి అమలు చేశారని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. 34 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం జీవోలు జారీ చేయడంతో పాటు శాసనసభలో ప్రత్యేక తీర్మానం ఆమోదించిందని చెప్పారు. బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం పెంచే విషయంలో టీడీపీ ముందుంటే, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీల ప్రయోజనాలకు అడ్డంకులు కల్పించిందని ఆయన ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై శాసనసభకు వచ్చి జగన్ మాట్లాడాలని సూచించారు. సామాజిక మాధ్యమాల కంటే ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు శాసనసభే వేదిక అని పేర్కొన్నారు. బీసీల హక్కుల కోసం టీడీపీ నిరంతరం పోరాడుతుందని, అక్టోబర్ 8న జరిగే బీసీ గర్జనను విజయవంతం చేయాలని కోరారు.
