తెలంగాణాలో మరోసారి తెరపైకి ‘బీసీ రిజర్వేషన్లు’
- చంద్రబాబు ‘సుప్రీం’ తలుపు తట్టడంతో ఆ పరిణామాలు తెలంగాణకూ కలిసివచ్చే ఛాన్స్
- గతంలో తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేరిస్తేనే అమలుకు అవకాశం
- రాజ్యాంగ సవరణతో ముడిపెట్టుకుని ఉన్న అంశంపై కేంద్రాన్ని ఒప్పించే దిశగా కసరత్తు
- మోడీ సర్కారులో భాగస్వామిగా చంద్రబాబుకే ఆ సత్తా ఉందంటున్న విశ్లేషకులు
- రిజర్వేషన్ల పెంపును ఏపీ సన్కారు సాధించుకుంటే.. తెలంగాణాకు అవకాశాలు మెరుగు
- పొరుగు రాష్ట్రం తరహాలోనే ఇటు కూడా బీసీ రిజర్వేషన్ల అమలుకు కసరత్తు పూర్తి
- ఇదే అదునుగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ
హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన బీసీ రిజర్వేషన్ల అంశం అటు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి, ఇటు తెలంగాణాలో రేవంత్ సర్కారుకు అత్యంత కీలకంగా, క్రియాశీలకంగా తయారైంది. చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై ఎలా ముందడుగు వేయాలన్న కోణంలో ఆలోచిస్తున్న ప్రజా ప్రభుత్వానికి అటు కూటమి సర్కారు మొదలుపెట్టిన కార్యాచరణతో ఆశలు చిగురిస్తున్నాయి.
తాజా పరిణామాలతో తెలంగాణ వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు పట్టుదలతో సుప్రీం కోర్టు తలుపు తట్టడంతో ఆ పరిణామాలు తెలంగాణకూ కలిసివచ్చే అవకాశాలు మెరుగవుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది కోర్టుల్లో తేలే అంశం కాదని గతంలో తమిళనాడు సాధించుకున్న తరహాలోనే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేరిస్తే అమలుకు అవకాశం ఉందని రాజ్యాంగ, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఏ కోణంలో చూసినా.. రాజ్యాంగ సవరణతోనే ముడిపెట్టుకుని ఉన్న అంశంపై కేంద్రాన్ని ఒప్పించే దిశగా చంద్రబాబు సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. మోడీ సర్కారులో భాగస్వామిగా చంద్రబాబుకే ఆ సత్తా ఉందని, ఆయన అనుకుంటే సాధించుకోగలరని రాజకీయ పండితులు, సామాజిక విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ల పెంపును ఏపీ సన్కారు సాధించుకుంటే.. తెలంగాణాకు అవకాశాలు మెరుగ్గా, మెండుగా ఉన్నాయన్న వాదనలు తెరపైకి వచ్చేశాయి. పొరుగు రాష్ట్రం ఏపీ తరహాలోనే ఇటు కూడా బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది.
ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో బీసీ రిజర్వేషన్ల అమలుపై అధికార పార్టీ మార్చిన రాజకీయ వ్యూహంతో కేంద్రంపై మరోసారి పోరుబాటకు సిద్దమవుతోంది. ఇటు రాష్ట్ర రాజకీయాలకు, అటు జాతీయ పార్టీకి కలిసొచ్చేలా రేవంత్ పార్లమెంటరీ వ్యూహాన్ని అమలు చేయాలని తాజాగా జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలోనూ నిర్ణయించారు. గతంలో ఇచ్చిన వాగ్ధానాలు, పెండింగ్ ప్రాజెక్టులపై బీజేపీని నిలదీయడమే లక్ష్యాంగా టీపీసీసీ ముఖ్య నేతలు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.
నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారును ఒప్పించి, మెప్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే అధికార పార్టీ నుంచి ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. అది సాధ్యం కాకుంటే మరో రూపంలో ఒత్తిడి తెచ్చేందుకు ప్రత్యామ్నాయ కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సమీప భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు అధికార పార్టీగా కాంగ్రెస్ గ్రౌండ్స్ ప్రిపేర్ చేసుకుంటోంది.
బీసీ రిజర్వేషన్లు ఇక ‘పొలిటికల్ గేమ్’గానే మిగులుతాయన్న రాజకీయ విమర్శల నుంచి తప్పించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ప్రభుత్వంగా హామీ ఇచ్చి పార్టీ పరంగా మాత్రమే అమలు చేస్తామని గతంలో ప్రకటించి రాజకీయంగా పప్పులో కాలేసిన సీఎం రేవంత్ రెడ్డి.. 42శాతం రిజర్వేషన్ల హామీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురైన సవాళ్లు, న్యాయపరమైన చిక్కులను తన ప్రసంగాల ద్వారా ప్రజలకు వివరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కాంగ్రెస్ చిత్తశుద్ది చూపించిందనే నమ్మకం జనాల్లోకి వెళ్లిందని, బీసీలంతా తమకే మద్ధతిచ్చి ఓటేస్తారనే బీసీ మంత్రులు, పీసీసీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ మద్దతుతో మంచి ఫలితాల సాధిస్తే క్యాడర్‌లో సార్వత్రిక ఎన్నికలకు కొత్త జోష్ వస్తుందని కాంగ్రెస్ నమ్ముతోంది. కాంగ్రెస్ సర్కార్‌పై వ్యతిరేకత వచ్చిందనేది నిరూపించే ఎన్నికలు ఇవేనన్న గులాబీ నేతల వ్యూహానికి చెక్ పెట్టనున్నారు. గల్లీ ఎన్నికలైనా.. ఢిల్లీ ఎన్నికలైనా కేసీఆర్‌ను ప్రజాక్షేత్రంలోకి రప్పించి, గతంలో జరిగిన అక్రమాలను ఎత్తిచూపుతూ రాజకీయంగా పైచేయి సాధించాలని కాంగ్రెస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.
అటు కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీ కూడా వచ్చే అసెంబ్లి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్దాయిలో తమ బలాన్ని పరిక్షించుకోవడానికి, లోకల్‌గా పార్టీకి చికిత్స చేయడానికి స్దానిక ఎన్నికలే సరైన వేదికగా భావిస్తున్న సందర్భంలో పోటాపోటీ వ్యూహాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వాస్తవానికి జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ వర్గాలను ఆకట్టుకోవడంలో కాంగ్రెస్ అనుసరించిన విధానం, వ్యూహం పొలిటికల్ గేమ్‌గానే మిగిలిపోయింది. కానీ క్షేత్రస్థాయిలో రాజకీయంగా ఈ వ్యవహారం నివురుగప్పిన నిప్పులా తీవ్ర దుమారం రేపుతోంది.
2023లో జరిగిన అసెంబ్లి ఎన్నికలు, 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఈ ఏడాది ప్రారంభంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో బీసీ వర్గాలను ఆకట్టుకోవాలన్న రాజకీయ వ్యూహంలో పార్టీగా కాంగ్రెస్ సక్సెస్ అయినప్పటికీ, ప్రభుత్వంగా విఫలమవుతోందన్న విమర్శలు తాజాగా జోరందుకున్నాయి. ఏ కోణంలో చూసినా ”కామారెడ్డి బీసీ డిక్లరేషన్” అమలుకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతూనే ఉన్నాయి. రాజకీయంగా సమాజంలో ఉనికిని పదిలపరుచుకునే క్రమంలో ప్రకటించిన 42శాతం రిజర్వేషన్ల హామీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు అనేక సవాళ్లు తప్పవనిపిస్తున్న సమయంలో ఏపీ సర్కారు కార్యాచరణ తెలంగాణాలో రేవంత్‌కు అండగా నిలుస్తోంది.
రేవంత్ సర్కారుపై ఇప్పటికీ కొనసాగుతున్న బీసీ వర్గాల ఒత్తిడి
ఈ విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తామన్న సీఎం రేవంత్.. తదనంతర చర్యల్లో అది కనిపించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయపోరాటం కొనసాగిస్తామన్న భరోసా ఏమైంది? అంటూ.. సమయం, సందర్భం దొరికినప్పుడల్లా ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న ‘పరిషత్’ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ప్లానేంటి? అన్న ప్రశ్న సొంత పార్టీ నేతల నుంచే ఉత్పన్నమవుతోంది.
అందుకే ‘సహకార’ ఎన్నికలకు మంగళం పలికారని, నామినేటెడ్ పద్దతిలో నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారని రాజకీయంగా విమర్శలు జోరందుకున్నాయి. క్షేత్రస్థాయిలో కేవలం రైతు కుటుంబాలతోనే కాదు.. గ్రామీణ ఆర్థిక స్థితిగతులు, వ్యవసాయ రంగంపై ఆధారపడిన అనేక వ్యవస్థల్లో క్రియాశీలక భూమిక పోషించే సింగిల్ విండో నామినేటెడ్ పదవుల్లో బీసీల కోటా అమలయ్యేనా? అన్నది నేటికీ ప్రశ్నార్థకంగానే మిగులుతోంది. బీసీ రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్తామని గతంలో చాలెంజ్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు అది సాధ్యం కాకపోవడంతో ఎలా ముందుకెళ్లాలా? అన్నదానిపై తర్జన భర్జన పడుతోంది.
అది పార్లమెంట్ చట్ట సవరణతో ముడిపెట్టుకుని ఉండడంతో.. అమలుకు కేంద్రం సహకరించడం లేదని ఆరోపిస్తూ.. ఆ నెపాన్ని బీజేపీ పైకి నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. సాధ్యం కావడం లేదు అని ప్రజల్లోకి వెళ్లి చెప్పడానికి మొహమాట పడుతోంది. అదే సమయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మరో కోణంలో మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ రాజకీయ వ్యూహాలను అన్వేషిస్తోంది. పరిషత్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై మరోసారి రాజకీయంగా చర్చ మొదలైంది.
56 శాతం జనాభాలో ఉన్న రిజర్వేషన్లు 29శాతం.. అమలవుతున్నది మాత్రం 25 శాతమే..
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీని కామారెడ్డి డిక్లరేషన్‌గా ప్రకటించి, బీసీల ఓటు- బ్యాంకును సృష్టించుకుంది. కానీ, తాజా హైకోర్టు స్టే, సుప్రీంకోర్టు తిరస్కారాలు, ఆర్థిక, చట్టపరమైన సమస్యల మధ్య, ఇది సాధ్యమే కాదని క్లారిటీ- వస్తోంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ కార్యాచరణ నేపథ్యంలో అక్కడి హైకోర్టు కొట్టివేయడంతో మరోసారి ఆ విషయం సుస్పష్టమైంది. తెలంగాణలో బీసీ వర్గాలకు చెందినవారు 56 శాతం జనాభా ఉన్నారు. కులగణనలో ఇది తేల్చారు. కానీ 29 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవి ఉద్యోగ, విద్య అవకాశాల్లో. రాజకీయంగా అయితే స్థానిక ఎన్నికల్లో 25 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలయ్యాయి.
కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, కులగణన చేస్తామని ప్రకటించారు. కులగణన చేశారు. హౌస్-టు-హౌస్ డేటా కలెక్షన్ చేశారు. బీసీలు 56.33శాతం అని రిపోర్ట్ వచ్చింది. ఈ డేటా ఆధారంగా అసెంబ్లీలో రెండు బిల్లులు పాస్ చేశారు. విద్య, ఉద్యోగ లోకల్ బాడీల్లో 42శాతం బీసీ కోటా కల్పించారు. కానీ సుప్రీంకోర్టు పెట్టిన 50శాతం కోటాను దాటిపోతుంది. బిల్లులు ఆమోదించాలని ఆగస్టులో రేవంత్ ఢిల్లీలో ధర్నా కూడా చేశారు. చివరికి జీవో ఇచ్చారు. ఈ జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీ-షన్ ఫైల్ చేసింది. ఆ ఎస్‌ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టి వేసింది. రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్‌లో పెడితేనే చెల్లుబాటు- అబుతుందని, ఆచరణలో అది సాధ్యం కాదన్నది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.
