మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుకు బషీరాబాద్ వీడీసీ కమిటీ నిర్ణయం
కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్ గ్రామానికి చెందిన వీడీసీ కమిటీ సభ్యులు శుక్రవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించనున్న వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలపై సీపీతో చర్చించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి కాలుష్యం పెరిగి జలచరాలు, పర్యావరణానికి నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలని సీపీ ఇటీవల గణేష్ మండళ్ల నిర్వాహకులకు సూచించారు. ఈ పిలుపునకు వీడీసీ కమిటీ సభ్యులు పూర్తి మద్దతు ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈసారి బషీరాబాద్ గ్రామంలో కేవలం మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీపీకి తెలిపారు.
మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుకు కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సీపీ సాయి చైతన్య అభినందించారు. అనంతరం వినాయక నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా బషీరాబాద్ గ్రామానికి విచ్చేయాలని కమిటీ సభ్యులు సీపీని సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో భీంగల్ సీఐ పొన్నం సత్యనారాయణ, కమ్మర్‌పల్లి ఎస్‌ఐ చిర్ర సతీష్, వీడీసీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
