పుష్కరాల పనులు పకడ్బందీగా పూర్తి చేయాలి
బాసర, ఆంధ్రప్రభ : గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనులన్నింటినీ పకడ్బందీగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం ఈవో కార్యాలయంలో పుష్కరాల పనుల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాసరలో శాఖల వారీగా చేపట్టిన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అధికారి తమ పరిధిలోని పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పుష్కరాలకు వచ్చే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, పార్కింగ్ తదితర మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. పుష్కరాల నిర్మాణ పనులకు సంబంధించి అటవీ శాఖ అనుమతులు అవసరమైతే వెంటనే ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం విశాలమైన పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. సమావేశంలో భైంసా సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, హార్టికల్చర్ అధికారి రమణ, ఆలయ ఈవో అంజనా దేవి, తహసీల్దార్ పవన్ చంద్ర తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
