ఘనంగా దండి ఉప్పు సత్యాగ్రహ దినోత్సవం

ఘనంగా దండి ఉప్పు సత్యాగ్రహ దినోత్సవం

బెజవాడ బార్ అసోసియేషన్‌లో గాంధీజీ పోరాట స్పూర్తిస్మరణ
అహింసా, సత్యాగ్రహ మార్గాలే సమాజానికి దిశానిర్దేశమని న్యాయవాదుల అభిప్రాయం

విజయవాడ, ఆంధ్రప్రభ : బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య సమరంలో కీలక మలుపు తిప్పిన సాల్ట్ మార్చ్ జ్ఞాపకార్థం దండి ఉప్పు సత్యాగ్రహ దినోత్సవాన్ని గురువారం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని బెజవాడ బార్ అసోసియేషన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని విజయవాడ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.కె. బాష ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాంధీహిల్ వైస్ చైర్మన్, మాజీ మేయర్ డాక్టర్ జంధ్యాల శంకర్ హాజరయ్యారు. కార్యక్రమంలో న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎ.కె. బాష మాట్లాడుతూ 1930 మార్చి 12న మహాత్మా గాంధీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహం స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచిందన్నారు. గుజరాత్‌లోని సభర్మాటి ఆశ్రమ నుండి దండి వరకు సుమారు 240 మైళ్ల దూరం నడిచి వెళ్లి సముద్రపు నీటితో ఉప్పు తయారు చేసి బ్రిటిష్ చట్టాన్ని గాంధీజీ ఉల్లంఘించడం దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త ఊపునిచ్చిందన్నారు. అహింసా, సత్యాగ్రహం వంటి గాంధీజీ ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపాయని తెలిపారు.

దక్షిణాఫ్రికా స్వాతంత్ర్య సమరయోధుడు నెల్సన్ మండేలా, అమెరికా పౌరహక్కుల ఉద్యమ నేత మార్టిన్ లూథెర్ కింగ్ వంటి మహానుభావులు కూడా గాంధీజీ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారని పేర్కొన్నారు. ముఖ్య అతిథి డాక్టర్ జంధ్యాల శంకర్ మాట్లాడుతూ గతంలో విజయవాడ చుట్టుపక్కల కొండలపై హెలికాప్టర్ ద్వారా విత్తనాలు చల్లిన కార్యక్రమాన్ని గుర్తుచేశారు. ఆ సమయంలో కొందరు విమర్శించినప్పటికీ ప్రస్తుతం వాటిలో దాదాపు 70 శాతం విత్తనాలు పెద్ద చెట్లుగా పెరిగి నగరానికి పచ్చదనం తీసుకొచ్చాయని తెలిపారు.

నాయకులు తమ పుట్టిన నేలపై ప్రేమతో పనిచేస్తేనే సమాజానికి ఉపయోగపడే ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారు అలాగే న్యాయవాదుల వృత్తి సమాజానికి న్యాయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని, చట్ట వ్యతిరేక చర్యలను ఖండిస్తూ ప్రజల హక్కులను కాపాడటంలో బార్ అసోసియేషన్లు ముందుండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు సంపద దుర్గా శ్రీనివాస్, వై.డేవిడ్ రాజు, గుండె రాజేష్, బెజవాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.వి. రంగారావు తదితరులు మాట్లాడారు. అనంతరం డాక్టర్ జంధ్యాల శంకర్‌ను సన్మానించి గాంధీజీ చిత్రపటాన్ని బహుకరించారు.

Leave a Reply