ఆసియా కప్ టీ20 2025లో బంగ్లాదేశ్ జట్టు అద్భుత విజయం నమోదు చేసింది. గ్రూప్-బీలో తమ మొదటి మ్యాచ్‌లోనే హాంకాంగ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంకా 14 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించిన బంగ్లా.. టోర్నమెంట్ ప్రయాణాన్ని విజయంతో ప్రారంభించింది. మరోవైపు, ఇది హాంకాంగ్‌కు వరుసగా రెండో ఓటమి కావడంతో, టోర్నమెంట్లో వారిపై ఒత్తిడి పెరిగింది.
హాంకాంగ్ బ్యాటింగ్..
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్, తమ బౌలింగ్ విభాగంతో ఆకట్టుకుంది. తంజీమ్ హసన్ సాకిబ్ (2/21), రిషద్ హొస్సేన్ (2/31) కీలక వికెట్లు తీసి హాంకాంగ్‌ను కట్టడి చేశారు. మహెది హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో హాంకాంగ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 143 పరుగులకు పరిమితమైంది. హాంకాంగ్ తరపున కెప్టెన్ నిజాకత్ ఖాన్ (40 బంతుల్లో 42 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
బంగ్లాదేశ్ ఛేజింగ్..
ఇక 144 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ ఆరంభంలో తడబడింది. పవర్‌ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు పర్వేజ్ హుస్సైన్ ఎమోన్ (14), తంజీద్ హసన్ (14) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. ఆ సమయంలో.. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన లిటన్ దాస్, తౌహీద్ హ్రిదోయ్ తో కలిసి ఇన్నింగ్స్‌ను స్థిరపరిచాడు.
ఈ జోడీ మూడో వికెట్‌కు 95 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. లిటన్ దాస్ కేవలం 39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 59 పరుగులు చేసి జట్టు విజయాన్ని సులభతరం చేశాడు. అతని దూకుడు ఇన్నింగ్స్… బంగ్లాదేశ్‌కు విజయాన్ని అందించింది.
చివరికి, లిటన్ దాస్ ఔటైన తర్వాత, తౌహీద్ హ్రిదోయ్ (36 బంతుల్లో 35, నాటౌట్) క్రీజులో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. బంగ్లాదేశ్ 18వ ఓవర్లోనే లక్ష్యాన్ని చేరుకుని 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
హాంకాంగ్ బౌలర్లలో అతీక్ ఇక్బాల్ (2/14) ఒక్కడే ఆకట్టుకోగా, మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. హాంకాంగ్‌కు 143 పరుగుల లక్ష్యం బంగ్లాదేశ్‌ను ఆపలేకపోయింది.

